
ఈఏపీ సెట్ అభ్యర్థులకు ‘హెల్ప్‌లైన్’
అనంతపురం: ఏపీ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థుల సందేహాల నివృత్తికి అనంతపురంలోని జేఎన్‌టీయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ సురేష్ బాబును, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ జయచంద్రా రెడ్డిని సంప్రదించవచ్చు.
రెండు వేల ఎకరాల్లో ఉద్యాన మొక్కలు నాటాలి
అనంతపురం అర్బన్: ఈ నెలాఖరులోగా జిల్లావ్యాప్తంగా రెండు వేల ఎకరాల్లో ఉద్యాన మొక్కలు నాటాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హార్టికల్చర్ ప్లాంటేషన్, పీటీఎం 2.0పై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్లాంటేషన్ లక్ష్యం మేరకు ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ నెల 10న చేపట్టనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0లో సాక్షులుగా సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్, విద్యాసంస్థలకు కావాల్సిన మొక్కల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డ్వామా పీడీ సలీమ్‌బాషా పాల్గొన్నారు.
వెల్లువెత్తిన వినతులు
పామిడి: పట్టణంలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రీసర్వే సమస్యలు, పేదల ఇళ్ల స్థలాల ఆక్రమణ, టిడ్కో ఇళ్ల రద్దు, భూవివాదాలు, విద్యుత్ సమస్యలు తదితర వాటిపై 567 అర్జీలు అందాయి. టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు రుణాలు రద్దు చేయించాలని, పేదలకు మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇవ్వాలని, రూ.5 లక్షల యూనిట్ వ్యయంతో ఇళ్లు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కే రహీమ్‌తో పాటు పలువురు పేదలు కలెక్టరుకు విన్నవించారు. విద్యుత్ చార్జీల తగ్గింపుతో పాటు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ స్థలం, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. పామిడి కమ్యూనిటీ ఆసుపత్రికి 50 పడకలను కేటాయించాలన్నారు. బదిలీల కౌన్సెలింగ్ త్వరగా చేపట్టాలని సచివాలయ నర్సులు అర్జీ సమర్పించారు. ఇక్కడ అందిన వినతులను గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివన్నారాయణశర్మ, డీఆర్వో మలోల, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సి.షర్మిల పాల్గొన్నారు.