
వడ్డీ వ్యాపారుల దాష్టీకం
● వడ్డీ చెల్లింపు ఆలస్యమైనందుకు బంగారు వ్యాపారిపై భౌతిక దాడి
అనంతపురం: నగరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శ్రుతిమించాయి. వడ్డీ చెల్లింపు కాస్త ఆలస్యమైనందుకు బంగారు వ్యాపారిపై భౌతిక దాడి చేశారు. విచక్షణారహితంగా బూతులు తిడుతూ నడిరోడ్డుపైనే కాలితో తన్నుతూ కింద పడేసి కొట్టారు. దీంతో బాధితుడితో పాటు మరికొందరు బంగారు వ్యాపారులు స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని వడ్డీ వ్యాపారుల దాష్టీకాలపై ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పాతూరుకు చెందిన తిరుపాల్ వద్ద బంగారు వ్యాపారి బాబ్జాన్ రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. వంద రూపాయలకు నెలకు రూ.10 చొప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. ఇలా ఇప్పటిదాకా దాదాపు రూ.10 లక్షలు వడ్డీ రూపంలో చెల్లించాడు. ఈ నెల కొంచెం ఆలస్యమైంది. దీంతో తిరుపాల్, అతని కుమారులు సూరి, శేషు ముగ్గురూ కలిసి వడ్డీ సరైన సమయానికి చెల్లించకపోతే ఎలా రా అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడే ఉన్న కొంత మంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా..వారిపైనా దాడికి తెగబడ్డారు. దీంతో దాదాపు వంద మంది బంగారు వ్యాపారులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లారు. వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను భరించలేకపోతున్నామని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్డీ డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు మహిళలను కూడా వేధిస్తున్నారని వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు తిరుపాల్, అతని కుమారులు సూరి, శేషు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఇన్‌చార్జ్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.