
పరిశోధనా కేంద్రానికి స్థల పరిశీలన
తాడిపత్రి రూరల్: 50 ఎకరాల్లో అరటి టిష్యూకల్చర్ పరిశోధన కేంద్రం ఏర్పాటుపై సోమవారం మండలంలోని తలారి చెరువు, భోగసముద్రం గ్రామాల పరిధిలోని స్థలాలను కలెక్టర్‌తో పాటు బీబీఎస్‌ఎస్‌ఐ టీం ప్రతినిధులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న భారతీయ బీచ్ సహకారి సమితి (బీబీఎస్‌ఎస్‌ఐ) తాడిపత్రి ప్రాంతంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు గ్రామాల్లో పరిశోధన కేంద్రానికి అవసరమైన భూమి, నీటి వనరులను పరీక్షించి ఒక గ్రామాన్ని ఎంపిక చేయనున్నారు. రెండు గ్రామాల పరిధిలోని స్థలాలను కలెక్టర్ వినోద్‌కుమార్, బీబీఎస్‌ఎస్‌ఐకి చెందిన ప్రతినిధులకు పారిస్ దేశాయ్, జయప్రకాష్, తివారిలతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు పరిశీలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అనంతపురం: నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో లక్ష్మీ టిఫెన్ సెంటర్ ఎదురుగా సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వి. ఈశ్వరయ్య (54) రోడ్డు దాటుతుండగా , గుర్తు తెలియని స్కూటీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ
యువకుడి మృతి
రాయదుర్గంటౌన్: పట్టణంలోని రాయదుర్గం – మొలకాల్మూరు రైలు మార్గంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బేల్దారి చాంద్‌బాషా (25) మృతి చెందాడు. పట్టణంలోని గ్యాస్ గౌడోన్ ఏరియాకు చెందిన చాంద్‌బాషా కుటుంబ ఆర్థిక సమస్యలతో రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బళ్లారి ఓపిడీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణమూర్తి తెలిపారు.
వేసవి శిక్షణ ప్రారంభం
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, మానవతా విలువలు అన్న అంశంపై శిక్షణ ఇస్తున్నారు. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు రామ కథ పేరుతో ఆధ్యాత్మిక సంగీత విభావరి నిర్వహించారు.

పరిశోధనా కేంద్రానికి స్థల పరిశీలన