
అనారోగ్యం తాళలేక బలవన్మరణం
రాప్తాడు: అనారోగ్యం తాళలేక జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని హమాలీ కాలనీలో నివాసముంటున్న వెన్నపూస విజయశేఖరరెడ్డి (39), మీన దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. విజయ శేఖర్ రెడ్డి గిఫ్ట్ అండ్ నావల్టీస్ షాపు నిర్వహిస్తుండగా, మీన టైలరింగ్‌తో కుటుంబానికి చేదోడుగా నిలిచింది. 2015లో చోటు చేసుకున్న ప్రమాదంలో విజయశేఖర్‌రెడ్డి వెన్నెముకతో పాటు తలకూ బలమైన గాయాలయ్యాయి. చికిత్స అనంతరం కోలుకున్నా... నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. కట్టె సాయం లేనిదే అడుగు కూడా వేయలేని స్థితిలో తీవ్ర మానసిక క్షోభను అనుభవించిన ఆయన 2018, 2019లో రెండు సార్లు విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయా సమయాల్లో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ నెల 4న సాయంత్రం తన తల్లిదండ్రులను మాట్లాడి వస్తానంటూ ఇంట్లో తెలిపి ఎలక్ట్రిక్ లగేజ్ ఆటో తీసుకుని బయలుదేరిన ఆయన ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం ప్రసన్నాయపల్లి గ్రామ సచివాలయం సమీపంలో ఆటోలో వెనుక వైపు ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని వెన్నపూస విజయశేఖరరెడ్డిగా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో భార్య మీన అక్కడకు చేరుకుని పరిశీలించి నిర్ధారించారు. మృతుడి వద్ద మద్యం బాటిళ్లు, విషపు గుళికల బాటిళ్లు లభ్యం అయ్యాయి. మీన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు.