
బేల్దారి ఆత్మహత్యాయత్నం
రాయదుర్గం టౌన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని భంభంస్వామి లే అవుట్ సమీపంలో నివాసముంటున్న చాంద్‌బాషా (25) బేల్దారి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. కొంత కాలంగా సరైన పనులు లేకపోవడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మనస్తాపం చెందిన చాంద్‌బాషా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమై శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన ఇంటికి సమీపంలోనే ఉన్న రైలు పట్టాలపైకి చేరుకుని కూర్చొన్నాడు. కాసేపటి తర్వాత ఆ మార్గంలో వచ్చిన హొస్పేట–యశ్వంత్‌పూర్ రైలు ఢీ కొనడంతో చాంద్‌బాషా ఎగిరి పట్టాలకు అవతల పడ్డాడు. లోకో పైలెట్ సమాచారంతో రైల్వే ఎస్‌ఐ మహేంద్ర, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలకు తీవ్రమైన గాయంతో అపస్మారక స్థితిలో చేరుకున్న చాంద్‌బాషాను వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.