
సంజమ్మకు సపర్యలు చేస్తున్న ఆది అనే భక్తుడు
పెద్దపప్పూరు(అనంతపురం): అంధురాలు.. ఆపై నడవలేని స్థితిలో ఉన్న ఓ మహిళ పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రంలో అనాథలా ఉండిపోయింది. పుట్లూరు మండలం కందికాపుల గ్రామానికి చెందిన సంజమ్మను ఎవరో పది రోజుల క్రితం ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆరుబయట దోమల బెడదతో పాటు ఈదురుగాలులకు వణుకుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
నిత్యం స్వామి దర్శనానికి వచ్చే పాముల ఆది అనే భక్తుడు అమెను చూసి చలించిపోయి సపర్యలు చేస్తున్నారు. ఆమెకు స్నానం చేయించి.. అన్నపానీయాలు అందిస్తున్నారు. అలాగే వదిలేస్తే ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉండటంతో అటువైపు వెళ్లిన ‘సాక్షి’ సదరు మహిళ సమీప బంధువుల ఫోన్ నంబర్ సేకరించి పరిస్థితి వివరించింది.
సంజమ్మ యల్లనూరులో ఉందనుకున్నామని, వెంటనే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపి అశ్వత్థం నుంచి తీసుకెళ్లాలని తెలియజేస్తామని సమాధానమిచ్చారు.