రెండంటే.. రెండే రోజులు | - | Sakshi
Sakshi News home page

రెండంటే.. రెండే రోజులు

Jul 3 2025 5:16 AM | Updated on Jul 3 2025 5:16 AM

రెండంటే.. రెండే రోజులు

రెండంటే.. రెండే రోజులు

అనంతపురం అగ్రికల్చర్‌: అన్నదాతలు ఆశలు పెట్టుకున్న ‘నైరుతి’ ముఖం చాటేసింది. ముంగారుకు ముందుగానే మురిపించిన రుతుపవనాలు తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా జిల్లాలో ఖరీఫ్‌ ఏరువాక నిరాశాజనకంగా ‘సాగు’తోంది.

కేవలం 30 వేల ఎకరాల్లో సాగులోకి పంటలు

ఈ ఖరీఫ్‌లో 8.48 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా జూన్‌ నెలాఖరుకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వేరుశనగ 9 వేల ఎకరాలు, కంది 10 వేల ఎకరాల్లో రాగా పత్తి, ఆముదం, ఇతర పంటలు కొంత విస్తీర్ణంలో విత్తారు. జూన్‌లో సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా 23.2 శాతం తక్కువగా 47.1 మి.మీ నమోదైంది.

ముందస్తుగానే ఆశల ‘నైరుతి’

గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ సారి జూన్‌ 2న జిల్లాలోకి ప్రవేశించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశించారు. అనుకున్నట్లు పంటలన్నీ సాగులోకి వస్తాయని అంచనా వేశారు. కానీ... రుతుపవనాలు ప్రవేశం తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు. జూన్‌ 8న, 11న మాత్రమే అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు పడ్డాయి. జూన్‌ 15 నుంచి పంటలు వేసుకునేందుకు సమయమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అలాగే ఏరువాక పౌర్ణమి కూడా వచ్చేసింది. అంతేకాక జూన్‌ 22న రైతులకు ఇష్టమైన ఆరుద్ర కార్తె కూడా ప్రవేశించింది. దీంతో పంటలు విత్తుకునేందుకు అన్ని శుభగడియాలు రావడంతో వర్షం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రోజూ మేఘాలు ఆవరిస్తున్నా 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలుల ధాటికి చెల్లాచెదరవుతున్నాయి. అక్కడక్కడ గాలితెరలు, తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. అరకొర వర్షాలకే అక్కడక్కడ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు.

21 మండలాల్లో లోటు వర్షపాతం

ముంగారు పంటలు విత్తుకునేందుకు మంచి అదను వచ్చినా వరుణుడు కరుణించ లేదు. ఈ నెల 15వ తేదీ వరకు విత్తుకునేందుకు మంచి సమయమని చెబుతున్నా... అది కూడా దగ్గర పడుతున్నందున రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా 47.1 మి.మీ నమోదైంది. 23.2 మి.మీ తక్కువగా కేవలం రెండు వర్షపు రోజులు నమోదయ్యాయి. అందులోనూ 21 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. గుంతకల్లు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, పామిడి, కూడేరు, పుట్లూరు, యల్లనూరు, నార్పల తదితర మండలాల్లో అయితే వర్షం జాడ కనిపించ లేదు. ఈ పది మండలాల్లో సాధారణం కన్నా 60 నుంచి 90 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మిగిలిన మండలాల్లో కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కణేకల్లు, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు లాంటి ఐదారు మండలాలు మినహా తక్కిన అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 63.9 మి.మీ మేర నమోదు కావాల్సి ఉంది. జాలై 15 లోపు జిల్లా అంతటా వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంటే ఖరీఫ్‌ ఏరువాకకు ఇబ్బంది ఉండదు. లేదంటే మరోసారి కరువు ఛాయలు తప్పవని రైతులు అంటున్నారు.

ముఖం చాటేసిన నైరుతి

జూన్‌లో కేవలం రెండు రోజుల వర్షం

61.2 మి.మీ గానూ 47.1 మి.మీ వర్షపాతం

నిరాశాజనకంగా ‘సాగు’తున్న ఖరీఫ్‌ ఏరువాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement