ప్రమోషన్లపై అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

ప్రమోషన్లపై అనాసక్తి

Jun 8 2025 12:48 AM | Updated on Jun 8 2025 12:48 AM

ప్రమోషన్లపై అనాసక్తి

ప్రమోషన్లపై అనాసక్తి

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపాలిటీ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులకు పదోన్నతులు తీసుకునేందుకు ఎస్జీటీలు ఆసక్తి చూపలేదు. వాస్తవానికి ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినా... చాలా సబ్జెక్టులకు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం విశేషం. వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయి శుక్రవారం సాయంత్రం మొదలైన పదోన్నతుల కౌన్సెలింగ్‌ శనివారం ఉదయం 10 గంటల వరకు సాగింది. ఇందులో జిల్లా పరిషత్‌ పాఠశాలలకు సంబంధించిన సోషల్‌ సబ్జెక్టులో 44 ఖాళీలుంటే కేవలం నలుగురే పదోన్నతి తీసుకున్నారు. అలాగే పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులకు సంబంధించి కూడా 45 ఉంటే కేవలం ఐదుగురు విల్లింగ్‌ ఇచ్చారు. చాలా పోస్టులు మిగిలిపోవడంతో ఆర్జేడీ శామ్యూల్‌ రాష్ట్ర అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నారు. ఆసక్తి ఉంటే వీరి తర్వాత వారిని కూడా పిలిచేలా అనుమతులు పొందారు. ఈ క్రమంలో ఆయా సబ్జెక్టులకు అర్హులైన ఎస్జీటీలకు ఎంఈఓల ద్వారా సమాచారం అందించి సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. సాయంత్రం 5.30కు ఆ రెండు కేడర్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా... సోషల్‌లో ఎస్సీ కోటాలో కొన్ని తప్ప తక్కిన అన్ని పోస్టులూ భర్తీ అయ్యాయి. పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు రాత్రి 11 గంటల సమయానికి 16 మంది పదోన్నతులు పొందారు.

బదిలీ అయిన ఎస్‌ఏల వివరాలు లేవట!

స్కూల్‌ అసిస్టెంట్ల కేడర్‌కు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పనిసరి, రిక్వెస్ట్‌ బదిలీలు పూర్తయ్యాయి. ఉత్తర్వులు కూడా జనరేట్‌ అయ్యాయి. ఇవన్నీ శుక్రవారం తెల్లవారుజామునే పూర్తయ్యాయి. అయితే జిల్లాలో ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే సమాచారం శనివారం రాత్రి వరకు విద్యాశాఖ అధికారులు చెప్పకపోవడం విశేషం. ఈ వివరాలు ఇంకా తమకు రాలేదంటూ డీఈఓ చెప్పారు. కాగా స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ టీచర్లందరూ శనివారం రిలీవ్‌ అయ్యి ఆదివారం కొత్తస్థానాల్లో చేరాలనే ఆదేశాల్లో మార్పు చేశారు. పాతస్థానాల్లో ఆదివారం (నేడు) రిలీవ్‌ అయ్యి సోమవారం కొత్త స్కూళ్లల్లో చేరాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పదోన్నతులు తీసుకునేందుకు

ముందకురాని ఎస్జీటీలు

44 ‘సోషల్‌’ పోస్టులకు నలుగురే ఆసక్తి

పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల్లోనూ అదే తీరు

నేడు ఎస్జీటీలకు వెబ్‌ ఆప్షన్లు

ఎస్జీ టీచర్ల బదిలీలకు ఆదివారం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోనున్నారు. మ్యానువల్‌గా కాకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఎంఈఓల కార్యాలయాల్లో 10 కంప్యూటర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటూ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆయా మండలాల పరిధిలోని టీచర్లందరికీ అక్కడే వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే సదుపాయం కల్పించనున్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో సరైన వసతి లేకపోతే సమీపంలోని స్కూల్‌లో ఏర్పాటు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో ఎంఈఓలందరూ అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్‌ మ్యానువల్‌గా నిర్వహించాలంటూ ఆదివారం ఐక్య ఉపాధ్యాయ సంఘాల వేదిక డీఈఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement