9న రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రం ప్రారంభం
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ)లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ కేంద్రాన్ని ఈ నెల 9న సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ(ఏ) పాలక భవనాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ బుధవారం పరిశీలించారు. అడ్మిన్ బిల్డింగ్‌లో క్లీనింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు, అవసరం మేరకు ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వి. రాజగోపాల్, జేఎన్‌టీయూ అనంతపురం ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రతాప రెడ్డి పాల్గొన్నారు.
రైలు కిందపడి ఇద్దరి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని చల్లవారిపల్లి వద్ద బుధవారం రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే ఎస్‌ఐ నాగప్ప తెలిపారు. అందిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. వయస్సు 40సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు.
అనంతపురం సిటీ: స్థానిక జీఆర్పీ పరిధిలోని గార్లదిన్నె–తాటిచెర్ల రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి (50) దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే అనంతపురం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
నేటి నుంచి
విత్తన వేరుశనగ పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో గురువారం నుంచి రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. కార్యక్రమాన్ని ఆత్మకూరు మండలం పంపనూరులో కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మిగతా మండలాల్లో శుక్రవారం నుంచి మొదలవుతుందని తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 90 కిలోలు (3 బస్తాలు) పంపిణీ చేస్తామన్నారు.


