‘పీఎంశ్రీ’తో పాఠశాలల సమగ్రాభివృద్ధి
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల సమగ్రాభివృద్ధికి పీఎంశ్రీ పథకం దోహదపడుతోందని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ అన్నారు. స్థానిక జిల్లా సైన్స్ సెంటర్‌లో మంగళవారం ఎంఈఓ–2, ఇంజినీర్లు, పీఎంశ్రీ పథకానికి ఎంపికై నా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో రాష్ట్ర పరిశీలకులు సురేష్‌కుమార్‌తో కలసి ఆమె సమావేశమై మాట్లాడారు. పీఎంశ్రీ పథకం లక్ష్యం, ఇందుకు సంబంధించి పాఠశాలల్లో విభాగాల ఏర్పాటు అంశాలను సురేష్‌కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. పథకంలో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, క్రీడా మైదానాల ఏర్పాటు, డిజిటల్ బోధన కోసం కంప్యూటర్ ల్యాబ్, శుద్ధ నీటి కోసం ఆర్వో ప్లాంట్ తదితర సౌకర్యాల ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం ఏపీసీ శైలజ మాట్లాడుతూ... పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కూల్ గ్రాంటు, ఎమ్మార్సీ గ్రాంట్, సీఆర్సీ గ్రాంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మండల విద్యాధికారులకు సూచించారు. అనంతరం పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనుల స్థితి, యాప్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలు... వాటి పరిష్కారం, భారత్ స్కౌట్ గైడ్స్ విభాగం ఏర్పాటుపై చర్చించారు. సమావేశంలో సమగ్రశిక్ష సూపరింటెండెంట్ మహమ్మద్ ఇక్బాల్, డీఈ జయరామ్, ఏపీఓ నారాయణస్వామి, టీసీఎస్ సాంకేతిక నిపుణుడు రాజు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఏపీిసీ శైలజ


