అప్పు చేసి.. ఐపీ పెట్టి..
బొమ్మనహాళ్: వ్యవసాయానికి పెట్టుబడులు కావాలంటూ తోటి రైతులు, వ్యవసాయ కూలీల వద్ద ఓ వ్యక్తి అప్పు తీసుకుని ఉడాయించిన ఘటనలో బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన మేరకు... దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన రూపనగుడి మనోహర్ తనకున్న 4 ఎకరాల భూమిలో మిరప పంట సాగు చేయడానికి 43 మంది రైతులు, వ్యవసాయ కూలీల నుంచి రూ.40.85 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం తన పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమి, సొంత ఇంటిని ఇతరులకు విక్రయించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని, రెండు ఫ్యాంట్లు, రెండు షర్టులు మాత్రమే ఉన్నాయని, అప్పులు తీర్చలేని పరిస్ధితుల్లో ఉన్నానని 43 మంది రైతులు, వ్యవసాయ కూలీలకు ఐపీ నోటీసులు పంపాడు. దీంతో 43 మంది బాధితులు ఆదివారం బొమ్మనహాళ్ పీఎస్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. తన పొలం, ఇంటిని అమ్మి అప్పులు రూ.40.85 లక్షలు తీరుస్తానని నమ్మించి మోసం చేశాడంటూ వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు విన్నవించారు.
రూ.40.85 లక్షలతో ఉడాయించిన వ్యక్తి


