ఫ్రీహోల్డ్ భూములకు పరిశీలన గ్రహణం
అనంతపురం అర్బన్: చంద్రబాబు పాలనలో అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. డి.పట్టా పొంది 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసి సంపూర్ణ హక్కు కల్పించి యజమానుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుని అమలు చేపట్టింది. జిల్లాలో 3.03 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ కల్పించడం ద్వారా 96 వేల మంది రైతులకు లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా ప్రక్రియ చేపట్టింది. అయితే టీడీపీ ప్రభుత్వం రావడంతో ఫ్రీ హోల్డ్ భూములకు పరిశీలనకు గ్రహణం పట్టింది. ఫ్రీహోల్డ్ చేసి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపేసింది. దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. భూములను పరిశీలన పేరుతో 18 నెలలుగా నాన్చుతూ వస్తోంది. పరిశీలన ప్రక్రియను 2026 జనవరి 11 వరకు పొడిగించింది. ఇదే క్రమంలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్‌శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని దుస్థితిని కల్పించింది. తమ కష్టం బయటకు చెప్పుకుంటే అధికార పార్టీవాళ్లు ఎక్కడ ఇబ్బంది పెడతారోనని రైతులు భయపడుతున్నారు.
18 నెలలుగా ఎటూ తేల్చని
చంద్రబాబు ప్రభుత్వం
జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములు
3.03 లక్షల ఎకరాలు
రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉత్తర్వుల జారీ
ఫ్రీహోల్డ్ భూములకు పరిశీలన గ్రహణం


