మంత్రి ఇలాకాలో నాణ్యతకు తిలోదకాలు
● మూడు నెలలకే శిథిలమైన రహదారి
● నాణ్యత పట్టించుకోని రోడ్లు భవనాల శాఖ
● ఆగమేఘాలపై బిల్లుల చెల్లింపు
విడపనకల్లు: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో అభివృద్ధి పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించింది. నాణ్యత లేకుండా నిర్మించిన పనులకు ఆగమేఘాలపై బిల్లులు చెల్లించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఫలితంగా రోడ్డు వేసిన మూడు నెలలకే కుంగిపోయి ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి.
రూ.1.50 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం..
విడపనకల్లు మండలం ఉండబండ సరిహద్దు నుంచి ఉరవకొండకు రూ.1.50 కోట్ల నిధులతో కొత్తగా తారు రోడ్డు వేశారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు పర్యవేక్షణ లోపించిన ఈ రహదారిని కేవలం 15 రోజుల్లోనే కాంట్రాక్టర్ ముగించేసి, బిల్లు చేసుకున్నాడు. ఉరవకొండ నుంచి పాల్తూరు మీదుగా ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలే ఎక్కువగా తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఒకటి, రెండు లారీలు సంచరిస్తుంటాయి. రోడ్డు వేసిన మూడు నెలలకే ఎక్కడికక్కడ కుంగిపోయి భారీగా గుంతలు పడ్డాయి. అంతేకాక రోడ్డు శివారు భాగం పూర్తిగా నెర్రెలు చీలాయి. కేవలం కాంట్రాక్టర్ స్వలాభం కోసమే ఈ రోడ్డు వేశారని, తద్వారా రూ.1.50 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు మండిపడుతున్నారు.


