నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించాలని సూచించారు. అర్జీలను meekosam.ap. gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
చిన్నారుల ఉజ్వల భవితకు రెండు చుక్కలు
అనంతపురం మెడికల్: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆదివారం నగరంలోని కోర్డు రోడ్డులో ఉన్న నెహ్రూ స్కూల్‌లో చిన్నారులకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు కలెక్టర్ ఆనంద్ పోలియో చుక్కల మందు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లాలో 2,84,774 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. తొలిరోజు వేయించుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శశిభూషణ్‌రెడ్డి, ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో విద్యార్థిని మృతి
రాప్తాడు రూరల్: ఎస్కేయూ విద్యార్థిని కాటెపోగు మాధుర్య (22) గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన కాటెపోగు పాపన్నకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా, చిన్న కుమార్తె మాధుర్య ఎస్కేయూ గోదావరి హాస్టల్‌లో ఉంటూ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. ఏడాదిన్నరగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. శనివారం స్వగ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించగా ఓ ఇంజక్షన్ వేశాడు. అనంతరం వర్సిటీకి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం హాస్టల్ గదిలో అపస్మారకంగా పడి ఉండడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చర్మవ్యాధికి వైద్యులు సూచించిన మాత్రల డోస్ ఎక్కువైనందున గుండెనొప్పి లేదా, ఫిట్స్‌తో మృతిచెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
నేడు ‘పరిష్కార వేదిక’
నేడు ‘పరిష్కార వేదిక’


