
వాళ్లకు వసూళ్లే ముఖ్యం.. మనతో ఏం పని!
టీడీపీలో పెల్లుబుకుతున్న అసమ్మతి
● ఇటీవల ‘అనంత మినీ మహానాడు’లో కార్యకర్త ఆత్మహత్యాయత్నం
● శింగనమల ఎమ్మెల్యే అవినీతిపై మంత్రికి ఓ తమ్ముడి ఫిర్యాదు
● గుంతకల్లు ఎమ్మెల్యే కుమారుడి దెబ్బకు ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నం
● హామీల అమలులో చేతులెత్తేసి అన్ని వర్గాలకూ ఇప్పటికే మోసం
● తమనూ దగా చేయడంపై ‘తమ్ముళ్లు’ రగిలిపోతున్న వైనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి నేడు మోసం చేయడంతో అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల తీరుతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇదే క్రమంలో తమను అన్యాయం చేస్తున్నారంటూ సొంత పార్టీకి చెందిన ‘తమ్ముళ్లు’ కూడా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. కూటమి సర్కారులో ఎమ్మెల్యేల దెబ్బకు టీడీపీ కార్యకర్తలే కుదేలవుతున్నారు. పదకొండు నెలలు కూడా తిరక్కముందే ఎమ్మెల్యేలపై బహిరంగంగానే టీడీపీ కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం కలకలం రేపుతోంది. అవినీతి, అక్రమాలు, కబ్జాలు, వసూళ్లతో తమను గాలికొదిలేశారని, పార్టీని గెలిపించి తప్పు చేశామంటుండటం గమనార్హం.
ప్లాంట్ అప్పగించాలని వేధింపులు..
పెనుకొండ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ‘గ్రీన్‌టెక్’ పేరుతో ఓ వ్యక్తి రీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నడుపుతున్నాడు. అయితే, ఈ ప్లాంటుపై కన్నేసిన మంత్రి సవిత తనకు అప్పగించాలంటూ నిర్వాహకుడిని భయపెట్టడం ప్రారంభించింది. కుటుంబానికి జీవనాధారమైన ప్లాంటును ఇవ్వాలనడంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. చివరకు విధిలేని పరిస్థితుల్లో మంత్రి ఒత్తిడికి తట్టుకోలేక ఎంపీ పార్థసారధిని భాగస్వామిని చేసుకుని నడుపుకుంటున్నారు.
ఉద్యోగులు.. అంగన్‌వాడీల పరిస్థితి ఘోరం
గత ఎన్నికల ముందు ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలకు టీడీపీ నేతలు ఎన్నో హామీలుఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే ఎమ్మెల్యేలు ఉద్యోగులను దారుణంగా చూస్తున్నారు. మొన్నటికి మొన్న మార్కెట్ యార్డులో ఓ ఉద్యోగిని ‘‘గాడిదలు కాస్తున్నావా’’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి అనడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఇక.. అంగన్‌వాడీ కార్యకర్తలు వేతనాల పెంపు కోసం ఇప్పటికే చలో విజయవాడ ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మిడ్ డే మీల్స్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లను బెదిరించి ఉద్యోగాలు పీకేస్తున్నారు. సీఐలు, తహసీల్దార్‌లను ఇంట్లో పనిమనుషులకంటే హీనంగా చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులను సైతం ఇష్టారాజ్యంగా తిడుతున్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారు.
‘నేను పార్టీకి ఎంతో కష్టపడి చేసినా న్యాయం చేయలేకపోయారు’ అంటూ మూడు రోజుల క్రితం అనంతపురంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మినీ మహానాడు’ కార్యక్రమంలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. పట్టించుకునే దిక్కులేక ఆ కుటుంబం వీధిన పడింది. ఇలాంటి కుటుంబాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలానే ఉన్నాయి.
తన కుమారుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తానని రూ.4 లక్షలు తీసుకుని మరొకరికి పోస్టు ఇవ్వడంతో గుంతకల్లుకు చెందిన టీడీపీ కార్యకర్త బోలే ఎల్లప్ప ఆత్మహత్యకు యత్నించాడు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తమ్ముడు గుమ్మనూరు నారాయణ.. బోలే ఎల్లప్ప కుమారుడు గిరీష్‌కు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తానని రూ.4 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత జయరాం కుమారుడు ఈశ్వర్.. గిరీష్‌ను తొలగించి మరొకరి దగ్గర రూ.8 లక్షలు తీసుకుని వేరొకరికి ఉద్యోగమిచ్చారు. దీంతో ఎల్లప్ప మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఈ మూడే కాదు.. ఉమ్మడి జిల్లాలో నేడు చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
‘శింగనమలలో వెస్ట్ నరసాపురం నుంచి గెలిచిన ఏకై క టీడీపీ ఎంపీటీసీ నా భార్య అంజనమ్మ. కానీ మాకు ఎమ్మెల్యే ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు’ అంటూ టీడీపీ నేత ప్రసాద్ నాయక్ ఏకంగా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్‌కు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే శ్రావణి ఎన్నిసార్లు వెళ్లినా పట్టించుకోలేదని, ఆమె తల్లి లీలావది షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతోందంటూ మంత్రికి వివరించాడు.

వాళ్లకు వసూళ్లే ముఖ్యం.. మనతో ఏం పని!