
‘జాబితా మతలబు’పై కమిషనర్ ఆరా
అనంతపురం ఎడ్యుకేషన్: రివర్షన్ తీసుకున్న టీచరును ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల జాబితాలో ముందు వరుసలో చేర్చిన వైనంపై విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆరా తీశారు. ఫిజికల్ సైన్స్ టీచరుగా పని చేస్తున్న గుత్తా వెంకటనాయుడు 2023 జూలైలో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది ఆత్మకూరు మండలం తోపుదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూన్నెళ్లు పని చేసిన తర్వాత రివర్షన్ (తిరిగి స్కూల్ అసిస్టెంట్‌గా) కోరుకుని ప్రస్తుతం డి.హీరేహాల్ మండలం 74–ఉడేగోళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల్లో నిబంధనల మేరకు రివర్షన్ తీసుకున్న ఉపాధ్యాయుడిని ఆ కేడర్‌లో అందరి కంటే జూనియర్‌గా పరిగణించాలి. అంటే రివర్షన్ వచ్చిన రోజు నుంచి కొత్తగా సర్వీస్‌ను లెక్కిస్తారు. ఈ లెక్కన ఆయన ఫిజికల్ సైన్స్ టీచర్లలో చివరివాడిగా దాదాపు 730 వరుస సంఖ్యలో ఉంటారు. మొత్తం స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో తీసుకుంటే చివరి స్థానం 6,291 నంబరులో ఉండాలి. ఈ విషయం ఇక్కడి అధికారులు, డీఈఓ కార్యాలయ ఉద్యోగులకూ తెలుసు. అయితే ఓ సంఘం నాయకుడు చక్రం తిప్పడంతో చిట్టచివరన ఉండాల్సిన గుత్తా వెంకటనాయుడు పేరు మొదటి స్థానంలోకి వచ్చింది. ఈ వ్యవహారంపై గురువారం ‘సాక్షి’లో ‘పదోన్నతుల జాబితాలో మతలబు ఏమిటో?’ శీర్షికన కథనం వెలువడింది. దీనిని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో గురువారం జరిగిన వెబెక్స్‌లో ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన చర్చ లేవనెత్తారు. విద్యాశాఖ జేడీ సర్వీసెస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 16న ప్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్ (ఎఫ్‌ఏక్యూ)లో ఇదే అంశంపై స్పష్టంగా ఇచ్చినా... అనంతపురం జిల్లాలో రివర్షన్ టీచరును జాబితా ముందు వరుసలోకి ఎలా చేర్చారంటూ ప్రశ్నించారు. పక్కన రిమార్కులు రాశామంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన జిల్లా అధికారులు.. చివరకు జాబితాను మార్పు చేస్తామంటూ వివరణ ఇచ్చారు. అనంతరం గుత్తా వెంకటనాయుడును మోస్ట్ జూనియర్‌గా పరిగణిస్తూ స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో చివరి పేరుగా చేర్చారు. ఇదే విషయాన్ని డీఈఓ ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు.
జాబితాలో ముందున్న రివర్షన్ టీచర్ పేరును కేడర్‌లో చివరిగా మార్పు చేసిన అధికారులు