
స్పష్టత లేని బదిలీల జాబితాలు
● డీఈఓకు విన్నవించిన ఏపీటీఎఫ్ (1938) నాయకులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు, షెడ్యూలు విడుదలై ఓ వైపు దరఖాస్తు చేసుకుంటున్నా నేటికీ జాబితాల్లో స్పష్టత ఇవ్వలేదంటూ ఏపీటీఎఫ్ (1938) నాయకులు వాపోయారు. ఈ మేరకు గురువారం డీఈఓ ప్రసాద్‌బాబును కలసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఇప్పటి వరకూ ఏ స్కూల్లో ఏ ఉపాధ్యాయుడు సర్ ప్లస్ అయ్యాడనే దానిపై సమాచారం లేదన్నారు. ఎవరు బదిలీ కింద దరఖాస్తు చేసుకోవాలనే అంశంపై కూడా క్లారిటీ లేదన్నారు. అన్ని సబ్జెక్టులకు, ఎస్జీటీలకు సంబంధించిన ఫైనల్ వెకెన్సీ, ఫైనల్ ప్రమోషన్ సీనియార్టీ లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఈఓ పూల్‌లో ఉన్న ఎల్పీలు, పీఈటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. డీఈఓ ఆఫీస్ నుంచి పంపుతున్న సమాచారం సరైన రీతిలో సర్కూలేట్ కావడం లేదన్నారు. పీహెచ్, వీహెచ్ ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్న తరుణంలో ప్రాథమికోన్నత పాఠశాలలో సర్ ప్లస్ కింద ఏ సబ్జెక్టు ఉపాధ్యాయులను తీసుకుంటారో.. సబ్జెక్టు వారీగా సీక్వెన్స్ తెలపాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్, జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్ర, అదనపు ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వజీర్‌బాషా, సాయినాథ్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు ఫక్రుద్దీన్, హుస్సేన్ ఖాన్ ఉన్నారు.