
తాడుతో గొంతు బిగించి.. కొడవలితో తలను వేరు చేసి
రాయదుర్గం టౌన్: ఈ నెల 15న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాయదుర్గం పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ జయనాయక్‌తో కలసి డీఎస్పీ పి.రవిబాబు వెల్లడించారు. రాయదుర్గం మండలం కొంతానపల్లికి చెందిన బోయ అంజినయ్య కుమారుడు వినోద్‌కుమార్ (22) టైలరింగ్‌తో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో స్వగ్రామంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో స్థిరపడిన వినోద్‌కుమార్... ఇటీవల స్వగ్రామానికి చేరుకుని స్థానిక గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడిగా పనిలోకి చేరాడు. ఈ నెల 17న రాయదుర్గంలో జరిగిన ప్రసన్న వేంకటరమణస్వామి రథోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. 18న కొంతానపల్లి వద్ద పొలంలో హతుడై కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో కొంతానపల్లికి చెందిన యువకులు నాయకుల రమేష్, నాయకుల బొమ్మలింగను గురువారం బళ్లారి మార్గంలోని చదం రైల్వే గేట్ వద్ద అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు గల కారణాలు వారు వెల్లడించారు.
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన
గ్రామంలోని మహిళల పట్ల వినోద్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చెడుగా ప్రచారమూ చేసేవాడు. దీంతో వినోద్‌కుమార్‌పై కక్ష పెంచుకున్న రమేష్, బొమ్మలింగ.. వినోద్‌కుమార్‌ను హతమార్చాలని నిర్ణయించుకుని అవకాశం కోసం వేచి చూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాయదుర్గంలో శ్రీవారి రథోత్సవానికి వినోద్‌కుమార్ వెళ్లినట్లుగా తెలుసుకుని అదే రోజు దారి కాపుకాచారు. సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వస్తున్న వినోద్‌కుమార్‌ను అడ్డుకుని పొలాల్లోకి లాక్కెళ్లి తాడుతో గొంతు బిగించారు. అనంతరం పదునైన కొడవలితో గొంతు కోసి తలను వేరుచేసి గుట్టు చప్పుడు కాకుండా ఉడాయించారు. హత్యకు ఉపయోగించిన నైలాన్‌తాడు, కొడవలి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ
నిందితుల అరెస్ట్