
పని రాక.. చేయలేక !
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో కీలక భూమికి పోషించే రెవెన్యూ శాఖలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. తీవ్ర పనిఒత్తిడితో ఇక్కడ పనిచేయలేక పోతున్నామని కలెక్టరేట్‌లోని కొన్ని విభాగాల అఽధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక మండలాల్లో కొందరు ద్వితీయశ్రేణి రెవెన్యూ అధికారులు, సిబ్బందికి తీరు మరోలా ఉంది. ఫైళ్లు సిద్ధం చేయడం చేతగాక ఇతరులతో తయారు చేయిస్తునట్లు ఆ శాఖ ఉద్యగులే చెబుతున్నారు. మరోవైపు మూడు తహసీల్దారు కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. మొత్తం మీద రెవెన్యూలో ‘ఇలాగైతే ఎలా’ అనే పరిస్థితి నెలకొంది.
ఇక్కడ పని చేయలేం బాబోయ్..
కలెక్టరేట్‌లో పనిచేయడమంటే చాలా గొప్పగా గర్వంగా భావించే వారు. అది గతం... ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధానంగా ఒకట్రెండు కీలక విభాగాల్లో పనిచేయడానికి ఉద్యోగులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఇంతటి ఒత్తిడితో ఇక్కడ చేయలేమని చెబుతున్నారు. ఉద్యోగులే కాదు విభాగాల అధిపతులుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో 60 శాతం ఉద్యోగులు తప్పదన్నట్లుగా అయిష్టంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. అవకాశం దొరికితే కలెక్టరేట్ నుంచి బదిలీ చేయించుకుని వెళ్లి పోయేందుకు... చివరికి సరిహద్దు మండలాల్లోనైనా పనిచేసేందుకు సిద్ధపడుతున్నారు.
పైళ్లు సిద్ధం చేయడం చేతగాక...
కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోని ద్వితీయశ్రేణి అధికారులు, సిబ్బందికి ఫైళ్లు సిద్ధం చేయడం చేతగాకపోవడంతో ఇతరుల (రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు)పై ఆధారపడుతున్నారు. ఫైలు తయారు చేసినందుకు వారికి కొంత మొత్తం ముట్టచెబుతారు. ఆ డబ్బును సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేస్తారు. ఇలా ఇద్దరు విశ్రాంత తహసీల్దార్లు, ఇద్దరు విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్లు, ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు వీఆర్‌ఓలతో పైళ్లను సిద్ధం చేస్తారని తెలిసింది. చుక్కల భూములకు సంబంధించి ఫైళ్లను ఒక వీఆర్‌ఓ తయారు చేస్తారని, ఇందుకు రూ.3 వేల వరకు వసూలు చేస్తాడని సమాచారం.
అవినీతి ఆరోపణలు..
జిల్లాలోని 31 మండలాల్లో ప్రధానంగా పామిడి, గుమ్మఘట్ట, రాప్తాడు తహసీల్దార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. డబ్బు ముట్టజెబితేనే పనులు జరుగుతాయన్న విమర్శలున్నాయి. ఈ మండలాల్లో అవినీతి వ్యవహారాలు, అధికారుల తీరుపై కలెక్టర్ వినోద్‌కుమార్‌కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఇక ప్రజాసమస్యల పరిష్కార వేదికలోనూ ఈ మండలాల అధికారులు, సిబ్బందిపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక్కడి అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసింది.
మండలాల్లో ఇతరులతో
ఫైళ్లు సిద్ధం చేయిస్తున్న ఉద్యోగులు
పని ఒత్తిడిలో కలెక్టరేట్ ఉద్యోగులు
మూడు తహసీల్దార్ కార్యాలయాలపై తీవ్ర అవినీతి ఆరోపణలు
రెవెన్యూ శాఖలో విచిత్ర పరిస్థితి
అవినీతిని సహించం
రెవెన్యూశాఖలో అవినీతిని సహించేది లేదు. ఆరోపణలు వస్తున్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. కలెక్టరేట్‌లోని ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ఏ ఫైళ్లు ఎలా ప్రిపేర్ చేయాలని ఆనే దానిపై రెవెన్యూ ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓ ద్వారా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
– వి.వినోద్‌కుమార్, కలెక్టర్

పని రాక.. చేయలేక !