ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Published Thu, May 23 2024 1:50 AM

ఇంటర్

అనంతపురం అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి మే 1 వరకు జరగనున్న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 22,510 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ రెండో సంవత్సర పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం కలుగండా విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. అన్ని చోట్ల ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, డీవీఈఓ వెంకటరమణనాయక్‌, డీఈఓ వరలక్ష్మి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సుజాత, కార్మిక శాఖ డీసీ లక్ష్మీనరసయ్య, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ మేనేజర్‌ రమేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

నేడూ ఇంటర్‌ ఫీజు

చెల్లించొచ్చు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్‌ కింద గురువారం కూడా చెల్లించవచ్చు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తూ ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్‌ పరీక్షల జిల్లా కన్వీనర్‌ ఎం.వెంకటరమణనాయక్‌ కోరారు. తత్కాల్‌ కింద రూ. 3 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అన్ని యాజమాన్యాల కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక చొరవ తీసుకుని ఎవరైనా ఫీజు చెల్లించని వారు ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడి ఫీజు చెల్లించేలా చూడాలని ఆదేశించారు.

ఆన్‌లైన్‌ మూల్యాంకనంపై అవగాహన

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులు వర్చువల్‌ విధానంలో అవగాహన కల్పించారు. అనంతపురంలోని కొత్తూరు ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల జూనియర్‌ కళాశాలల నుంచి 150 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఇంటర్‌ బోర్డు అధికారులు వి.సుబ్బారావు, వి.రమేష్‌ ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. సదస్సులో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్‌, ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్‌, డీఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూముల వద్ద

ప్రత్యేక జాగ్రత్తలు

అనంతపురం అర్బన్‌: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ బుధవారం జేఎన్‌టీయూలోని స్ట్రాంగ్‌ రూములను తనిఖీ చేశారు. అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వర్షం వస్తే స్ట్రాంగ్‌ రూముల్లోకి నీరు వెళ్లకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ప్రతి స్ట్రాంగ్‌ రూమును తనిఖీ చేసి లీకేజీకి అవకాశం ఉందా అనేది గమనించాలని, లీకేజీకి ఆస్కారం ఉంటే తక్షణం మరమ్మతు చేయాలని చెప్పారు. గదులకు వెనుక, ముందు టార్ఫాలిన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పై అంతస్తు నుంచి నీరు గదిలోకి దిగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఓ రాంభూపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఓబుళరెడ్డి, అధికారులు ఉన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
1/1

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Advertisement
 
Advertisement
 
Advertisement