ప్రజలందరికీ సచివాలయ సేవలు అందాలి

కళ్యాణదుర్గం: సచివాలయ సేవలు ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ సూచించారు. కళ్యాణదుర్గం మండలం నారాయణపురం సచివాలయాన్ని శుక్రవారం మంత్రి తనిఖీ చేశారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, సచివాలయ సేవలను మరింత విస్తృత పరచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలోని డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత గాజుల ప్రభాకర్ కుమారుడి వివాహ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
12 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్/బుక్కరాయసముద్రం: ముంగారు తొలకర్లు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 12 మండలాల పరిధిలో 6.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. డి.హీరేహాళ్‌లో 69.8 మి.మీ, గార్లదిన్నెలో 68.6 మి.మీ భారీ వర్షం కురిసింది. బ్రహ్మసముద్రం 15.2, రాయదుర్గం 14.2, యాడికి 10.2 మి.మీతో పాటు కణేకల్లు, బెళుగుప్ప, శింగనమల, గుత్తి, గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, రాప్తాడు తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. కాగా ఈనెల 5 నుంచి 7వ తేదీ మధ్య తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రశాంతంగా ‘పది’
సప్లిమెంటరీ పరీక్షలు
రాప్తాడురూరల్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు తెలుగు, ఉర్దూ, సంస్కృతం, కన్నడ పరీక్షలకు 3,987 మంది విద్యార్థులకు గాను 2,842 మంది హాజరయ్యారు. 1,145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
నేటి నుంచి గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు జరగనున్నాయని కలెక్టర్ గౌతమి శుక్రవారం తెలిపారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు 522 మంది అభ్యర్థులు హాజరవుతాన్నారు. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9.45 గంటలలోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరవ్వాలన్నారు.
ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు
రాప్తాడు రూరల్: ఉపాధ్యాయ బదిలీల్లో కీలకమైన ఖాళీలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి గురువారం రాత్రి 11 గంటల సమయానికి పూర్తి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 731 అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి అర్హత ఉన్నవారికి పాయింట్లను కేటాయించి జాబితాలో చేర్చారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచే అన్ని జిల్లాల ప్రొవిజనల్ సీనియార్టీ తుది జాబితాలను శనివారం ప్రకటించాల్సి ఉంది. ఖాళీలకు సంబంధించి ఈ ఏడాది మే 31 వరకు ఉన్న ఖాళీలన్నీ వెబ్‌సైట్‌లో పొందు పరుస్తున్నారు. శుక్రవారం రాత్రికి అన్ని కేడర్లకు సంబంధించి దాదాపు 4,400 ఖాళీలు అప్‌లోడ్ చేశారు. మరో 300 దాకా పెరిగే అవకాశం ఉంది.