12వ పీఆర్‌సీ, ఐఆర్‌లను వెంటనే
ప్రకటించాలి
కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిరసన
కలెక్టర్‌కు వినతిపత్రం
తుమ్మపాల : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆగస్టు 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సు నిర్ణయం మేరకు ఈ ఉద్యమ కార్యాచరణ లేఖను అందజేసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా శాఖ చైర్మన్ ఎస్.ఎస్.వి.ఎస్ నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే 37 నెలలు ఆలస్యమైన 12వ పీఆర్‌సీ కమిషన్‌న్‌ను వెంటనే నియమించాలని, తాత్కాలిక భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను విడుదల చేయడంతో పాటు పెన్షనర్లకు తగ్గించిన 3 శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షనన్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల 26 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని, గత 8 ఏళ్ల బకాయిలను పే–స్లిప్పుల్లో నమోదు చేయాలన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై కొందరు చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం స్పందించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ డి.లోవరాజు, రెవెన్యూ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ మూర్తి, ఏపీ పీటీడీ జిల్లా అధ్యక్షులు డీఎన్ మూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. శంకర రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డి. దొరబాబు, ఏపీవీఆర్‌ఓఎస్ అసోషియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జిల్లా ఏపీవీఆర్‌ఓ అధ్యక్షులు ఏ. శశి, ఏపీ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి శేఖర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నుంచి ఎం.ఎన్.ఎన్ సూరి శివ, ఏపీ ఫిజికల్ చాలెంజ్‌డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు, డివిజన్ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


