అనకాపల్లి టౌన్ : అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ విభాగానికి వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. దీంతో భారీ క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. ఇక్కడకు ప్రతిరోజూ సుమారు 650 నుంచి 700 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓపీ మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ కొనసాగుతుంది. దీంతో క్యూలైన్లు బారులు తీరుతున్నాయి. పెరిగిన రద్దీకి తగ్గట్టుగా ఓపి కౌంటర్లు లేకపోవడంతో పేషంట్లతో వచ్చిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సోమవారం 11.30 గంటల సమయంలో ఓపి కౌంటర్ల వద్ద తోపులాట, కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది.
సెక్యూరిటీ సిబ్బంది సర్ది చెప్పడంతో గొడవ సద్దు మనిగింది. జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిగా ఉండడంతో చుట్టపక్కల గ్రామాల నుంచి, స్ధానికులు అధిక సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తున్నారు.అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఓపీ కౌంటర్లను పెంచాల్సిన అవసరం ఉంది.


