చోడవరం: గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... 2016లో దేవరాపల్లి శివారులో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా అప్పటి ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇనస్పెక్టర్ సిహెచ్.వి.ప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా అటుగా వెళుతున్న టాటా ఇండికా కారులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కారును తనిఖీ చేయగా అందులో 144కేజీల గంజాయిని పట్టుకున్నారు. కారుతో పాటు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ వాదనలు విని, నిందితులు దేవరాపల్లికి చెందిన అతవ అచ్యుతరావు, తమిళనాడుకు చెందిన ఒచ్చు విజయ్‌కుమార్ పై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. ఒక్కొక్కరికి 10యేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి హరినారాయణ తీర్పు చెప్పినట్టు సుధీర్ తెలిపారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ అన్ని వివరాలు కోర్టుకు అందించడంతో నేరం రుజువైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడేలా అన్ని సాక్షాధారాలు సేకరించిన వారందర్నీ ఆయన అభినందించారు.


