ఇతర దేశాల్లో కొలువుల పేరిట
నిలువుదోపిడీ!
వర్క్ వీసాల ఆశ చూపిస్తూ
కేటుగాళ్ల పంజా
రూ.కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేస్తున్న
నకిలీ కన్సల్టెన్సీలు
ద్వారకానగర్ కేంద్రంగా
పుట్టగొడుగుల్లా సంస్థలు
విశాఖ విద్య: చేతిలో డిగ్రీ ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న తపనా ఉంది. అదే వారి బలహీనతగా మారుతోంది. భవిష్యత్తుపై వారికున్న ఆశ కొందరి కేటుగాళ్లకు ఆసరాగా మారుతోంది. విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసాల ముసుగులో మోసగాళ్లు యువతకు వల విసురుతున్నారు. రూ.లక్షలు కాజేస్తూ.. వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో బానిస బతుకులు మొదలుకొని.. ద్వారకానగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ తరహా హైటెక్ మోసాల దాకా విశాఖలో విదేశీ ఉద్యోగ రాకెట్ కోరలు చాస్తోంది. లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం దక్కుతుందని నమ్మి యువత కేటుగాళ్ల వలలో పడుతోంది. కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా సమర్పించుకున్న తర్వాత లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు, కొన్ని సందర్భాల్లో అధికారుల ఉదాసీనత వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
విశాఖ కేంద్రంగా సైబర్ స్లేవరీ రాకెట్
గతంలో విశాఖ కేంద్రంగా నడిచిన ఆగ్నేయాసియా సైబర్ స్లేవరీ రాకెట్ తీవ్ర సంచలనం సృష్టించింది. విశాఖ యువతను సింగపూర్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల్లో డేటా ఎంట్రీ, రిసెప్షనిస్ట్, హోటల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక కంబోడియా, థాయిలాండ్, మయన్మార్‌లలోని రహస్య ప్రాంతాలకు తరలించి పాస్‌పోర్టులు లాక్కున్నారు. వారిని బానిసలుగా మార్చి భారతీయులపైనే బిట్‌కాయిన్, ఫెడెక్స్, స్టాక్ మార్కెట్ సైబర్ మోసాలు చేయాలని చిత్రహింసలకు గురిచేశారు. విశాఖ పోలీసుల ప్రత్యేక చొరవ, హెల్ప్‌లైన్ ద్వారా గత ఏడాది కాలంలో సుమారు 87 మందికి పైగా బాధితులను రక్షించి స్వదేశానికి తీసుకొచ్చారు.
నకిలీ ఆఫర్ లెటర్లతో ఐటీ మోసాలు
కొందరు కేటుగాళ్లు నకిలీ కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసి, ప్రముఖ ఐటీ కంపెనీల పేరిట నకిలీ ఆఫర్ లెటర్లను సృష్టించి మోసగిస్తున్నారు. విదేశీ ప్రాజెక్టుల్లో ఉద్యోగాల పేరుతో రిజిస్ట్రేషన్, ట్రైనింగ్ ఫీజుల కింద రూ.లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. గతంలో ‘వునాతి టెక్నాలజీస్’ అనే సంస్థపై విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ‘ఫ్లై బై నైట్’ అనే సంస్థ సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడి నిరుద్యోగులను నిండా ముంచింది.
‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ ఘరానా మోసం
ఇటీవలే ద్వారకానగర్‌లో ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ కన్సల్టెన్సీ నిరుద్యోగులను భారీగా ముంచేసింది. గతేడాది మార్చిలో ప్రారంభమైన ఈ సంస్థకు ముసునూరి సౌజన్య మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంలోనే విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. బాధితులకు వీసాలు రాకపోగా, ఇచ్చిన డబ్బు తిరిగి రాక రోడ్డున పడ్డారు. హైదరాబాద్‌లోనూ ఈ సంస్థపై పలు ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. నిందితురాలు సౌజన్యను అరెస్ట్ చేసే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పెనమలూరులోని ఆమె నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు దర్యాప్తు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ‘జరిగిందేదో జరిగింది.. సెటిల్‌మెంట్ చేసుకోండి’ అంటూ మధ్యవర్తులు రంగంలోకి దిగి బాధితులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ద్వారకానగర్‌లో పుట్టగొడుగుల్లా కన్సల్టెన్సీలు
విశాఖ ద్వారకానగర్‌లోని రెండో, మూడో లైన్లలో కన్సల్టెన్సీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. యూకే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ లాంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని.. ఇంగ్లిష్ రాకపోయినా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నకిలీ కన్సల్టెన్సీలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


