కోటవురట్ల: విద్యా బుద్ధులు నేర్పి, క్రమశిక్షణను అలవరిచి తమ ఉన్నతికి కారణమైన గురువును పూర్వ విద్యార్థులు అపూర్వ రీతిలో సత్కరించి తమ గురుభక్తిని, ఆత్మీయతను చాటుకున్నారు. రాట్నాలపాలెంలో 1988లో ఎంపీపీ స్కూల్ ప్రారంభం కాగా, ఆ పాఠశాలకు పత్రి ప్రసాదరావు అదే సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా చేరారు. అప్పటి నుంచి 2001 వరకు అదే పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించారు. ఆ సమయంలో అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నత జీవితాలను అనుభవిస్తున్నారు. తమ ఉన్నతికి కారణమైన ప్రసాదరావు మాస్టారును మేళతాళాలతో పాఠశాలలోకి సాదరంగా తీసుకెళ్లి ఘనంగా సత్కరించారు. గురువు పాదాలకు ప్రణమిల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శిష్యుల ప్రేమానురాగాలకు భావోద్వేగానికి గురైన ప్రసాదరావు ఆనందభాష్పాలతో దీవించారు. ఈ అపూర్వ ఘటన గురు శిష్యుల బంధానికి తార్కాణంగా నేటి తరం విద్యార్థులకు మార్గదర్శంగా నిలిచింది.


