రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు భయంతోనే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ పరిస్థితులు, విపత్తుల కారణంగా గత రెండేళ్లలో వేసిన పంట ఏదో రూపంలో నాశనమై రైతు నష్టపోయాడు. ‘అన్నదాత సుఖీభవ’ పేరిట తొలి ఏడాది ఎగవేత, రెండో ఏడాది అరకొర సాయం అందించడం, ఉచిత పంట బీమా లేకపోవడంతో రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో వ్యవసాయం చేద్దామని సిద్ధపడగా ఎల్‌నినో ప్రభావంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఆగస్టు పూర్తయినా జిల్లాలో 20 శాతం నాట్లు కూడా పడలేదు. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 1.32 లక్షల ఎకరాల్లోపంట వేశారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సాగు ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం 20 శాతం కూడా వరినాట్లు వేయలేదు.
ఎల్‌నినో ఎఫెక్ట్
సాక్షి, అనకాపల్లి: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. జిల్లాలో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జులై, ఆగస్టు నెలల్లో దాదాపు 69 శాతం వర్షపాతం లోటు నమోదైంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు. ఈ నెలల్లో కూడా 35 నుంచి 40 శాతం వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో వరి సాగుకు సవాళ్లు తప్పేలా లేవు. ఈ ఏడాది ఖరీఫ్ మొదలైన తరువాత సరైన వర్షాలు లేకపోవడం, నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
ముందస్తు చర్యలేవి ?
ఆగస్టులో వర్షాలు కురుస్తాయన్న ఉద్దేశంతో జులైలో వరి నారుమళ్లు పోసిన రైతులు, నారును బతికించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి మడులను తడుపుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తుగా అవగాహన కల్పించకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉన్నా ఇప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ట్యాంకర్ల నీటితో నారు తడుపుతున్న రైతులు
జిల్లాలో తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటిమట్టం బాగా తగ్గిపోయింది. తాండవ, శారదానది, వరహా నది, సర్పా నదుల గ్రోయిన్లు, ఆనకట్టలు, ఇతర నీటి వనరుల కింద దాదాపు 1.32 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యం కాగా, ఇంతవరకు కనీసం వంద ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు. నదుల్లో కనీస స్థాయిలో కూడా నీటి ప్రవాహం లేకపోవడంతో ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు పారడం లేదు. తాండవ, రైవాడ రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో మందకొడిగా నాట్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు 10 నుంచి 20 శాతం నాట్లు జరిగాయి. మిగిలిన చోట్ల వర్షాలు ముఖం చాటేయడంతో మడుల్లో వరినారు ఎండిపోతోంది. బోర్లు, బావులున్న రైతులు మినహా మిగిలిన వారెవరూ ఇంతవరకు వరినాట్లు వేయలేదు. విత్తనాలు మొలిచిన తరువాత నారు పెరగడానికి సరిపడా వర్షాలు పడకపోవడంతో రైతులు వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్లతో నీటిని తీసుకువచ్చి తడుపుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి వస్తోందని, ఒక్కో విడత నీటి రవాణా కోసం రూ.1,000 చెల్లిస్తున్నామని, మొత్తం మీద వరినారు నాటే దశకు పెరిగే వరకు రూ.4,000 ఖర్చువుతుందని రైతులు వాపోతున్నారు.
తీవ్ర కరువు ఛాయలు
జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలతో పాటు పరవాడ, సబ్బవరం మండలాల్లో కరువు ఛాయలు ఎక్కువగా ఉన్నాయి. తాండవ రిజర్వాయర్ పరిధిలో నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం రూరల్ పరిధిలో 10 శాతం మాత్రమే వరినాట్లు వేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలంలో సర్పా, వరహా నదులపై నిర్మించిన ఆనకట్టల ద్వారా బూరుగుపాలెం, తాడపాల, పైడిపాల, లచ్చన్నపాలెం, మాకవరపాలెం, తామరం, జంగాపల్లి, నారాయణరాజుపేట, గిడితూరు గ్రామాలకు నీరు సరఫరా కాలేదు.
● శారదా నది కింద అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల్లో ఏడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా జూలై నెల మధ్య నుంచి శారదా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆగస్టు వచ్చినా నీరు లేకపోవడంతో 10 శాతం కూడా వరినాట్లు జరగలేదు. అనకాపల్లి, కశింకోట, మునగపాక, యలమంచిలి, పరవాడ, సబ్బవరం మండలాల్లో గత నెలలో వరి నారుమడులు పోశారు. సరైన వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల నారు ఎండిపోయింది.
వర్షాభావంతో ఎండిపోతున్న నారు
బతికించుకోవడానికి ట్యాంకర్లతో నీరు
ఒక్కో ట్యాంక్ నీటికి రూ.1,000 ఖర్చు
అడుగంటుతున్న రిజర్వాయర్లు
నారు అందివచ్చినా నాట్లు వేయలేని పరిస్థితి
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల ఎకరాలు
ఇప్పటివరకు 20 శాతం కూడా జరగని వరి నాట్లు
ఎండిపోతున్న నారుమడులు
తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరినాట్లు కోసం వేసిన నారుమడులు సైతం ఎండిపోతున్నాయి. మా ప్రాంతంలో ఏటా ముందుగా నాట్లు వేసేవాళ్లం. అలాంటిది ఈ ఏడాది నారుమడులు రక్షించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేసి వారి ఇబ్బందులుపై దృష్టి సారించాలని కోరుతున్నాం.
– నూకినాయుడు, రైతు,
లింగంపేట, గొలుగొండ మండలం
చుక్క చినుకు లేదు
జూన్ నెలాఖరులో కురిసిన వర్షాలకు రెండు ఎకరాల్లో వరినాట్లకు రెండు కట్టలు ధాన్యం ఆకుపోత వేశాను. ఆగస్టు నెల వచ్చినా చుక్క చినుకు లేదు. మధ్యలో డీజిల్ ఇంజిన్‌తో ఆకుమడికి రెండు నీటి తడులు అందించినా ప్రయోజనం లేకపోయింది. వేసిన వరి ఆకు అంతా ఎండిపోయింది. దుక్కులకు, విత్తనాలకు, ఎరువులకు ఇతర పెట్టుబడులకు ఆరు వేల వరకు ఖర్చు పెట్టిన ఫలితం దక్కలేదు. వచ్చే ఏడాది తిండి గింజలతో పాటు పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది.
– బండి రాజారావు,
లోపూడి రైతు, బుచ్చెయ్యపేట
‘కల్యాణపులోవ’ నీరు విడుదల చేసినా రాలేదు
నీరు లేక వరినారు ఎండిపోతోంది. ఆర్థిక భారమైనప్పటికీ చెరువుల్లోంచి నీటిని మోటారు ద్వారా తోడి రెండు సార్లు తడిపాము. కానీ ప్రయోజనం లేకపోయింది. మా భూములున్న ప్రాంతంలో బోర్లు లేవు. చెరువులో కూడా నీరు లేదు. మా గ్రామానికి కల్యాణపులోవ జలాశయం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. జలాశయం నుంచి నీరు విడుదల చేసి 15 రోజులవుతోంది. ఇంతవరకూ మా పొలాలకు చేరలేదు. గతంలో జలాశయం నుంచి నీరు విడుదల చేశాక రెండు, మూడు రోజుల్లో మా పొలాలకు చేరేది.
– గట్రెడ్డి రాజారావు, రైతు, దొండపూడి, రావికమతం మండలం


