కేజీహెచ్ యాజమాన్యం ఏకపక్ష ఉత్తర్వులకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ‘నో’
ప్రైవేట్ ఆస్పత్రి కన్సల్టెంట్‌గా ఉన్నారంటూ న్యూరోసర్జన్ శివరామకృష్ణ లాగిన్‌కు నిరాకరణ
బాధ్యతలు వద్దన్నా బలవంతంగా కట్టబెట్టిన అధికారులకు గట్టి ఎదురుదెబ్బ
మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్ అధికారుల ఏకపక్ష నిర్ణయానికి ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ గట్టి బ్రేక్ వేసింది. నిబంధనలను పక్కనపెట్టి న్యూరోసర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ కొండపల్లి శివరామకృష్ణను ఎన్టీఆర్ వైద్యసేవ మెడికల్ కోఆర్డినేటర్ (మెడ్కో)గా నియమిస్తూ కేజీహెచ్ యాజమాన్యం పంపిన ప్రతిపాదనకు ట్రస్ట్ ఆమోదం తెలపలేదు. ఆయనకు మెడ్కో లాగిన్ ఇచ్చే ప్రక్రియను నిలిపివేసింది. దీంతో కేజీహెచ్ అధికారుల ‘మెడ్కో మాయాజాలం’ బట్టబయలైందన్న విమర్శలు ఆస్పత్రి వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఈ వ్యవహారంపై ‘కేజీహెచ్‌లో మెడ్కో మాయాజాలం’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అత్యంత రద్దీగా ఉండే న్యూరోసర్జరీ విభాగానికి చెందిన వైద్యుడికి కీలక పరిపాలనా బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నుంచే ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడటంతో కేజీహెచ్ అధికారుల నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది.
లాగిన్‌కు ‘నో’
కేజీహెచ్ నుంచి పంపిన వివరాల ఆధారంగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పోర్టల్‌లో నమోదైన తాజా అభ్యంతరం ప్రకారం.. డాక్టర్ శివరామకృష్ణ ఇప్పటికే విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రిలోని ఓ యూనిట్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ మెడ్కోగా ఆయన అభ్యర్థనను ఆమోదించాలంటే ముందుగా అక్కడి కన్సల్టెంట్ హోదా నుంచి ఇన్‌యాక్టివేట్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కారణంతోనే మెడ్కో లాగిన్‌కు ఆమోదం లభించలేదు. అంటే కేజీహెచ్ అధికారులు ఒక వైపు ఉత్తర్వులు జారీ చేసి, మరోవైపు ఆ నియామకానికి అవసరమైన అర్హతలు, నిబంధనలను పరిశీలించకుండానే ముందుకు వెళ్లారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘వద్దు’ అన్నా..
మెడ్కో బాధ్యతలు స్వీకరించలేనని సంబంధిత వైద్యుడు ముందుగానే అభ్యంతరం తెలిపినప్పటికీ, ఆయనపై బలవంతంగా బాధ్యతలు మోపారన్న ఆరోపణలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒక వైపు వైద్యుడి విముఖత.. మరోవైపు ఆయనకు కేటాయించిన మెడ్కో బాధ్యతలకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నుంచి ఆమోదం రాకపోవడం అధికారుల అత్యుత్సాహాన్ని బహిర్గతం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ జోక్యం చేసుకోవాలి?
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా దృష్టి సారించాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. కేజీహెచ్ అధికారులు మెడ్కోగా ఎవరిని, ఏ నిబంధనల ప్రకారం ఎంపిక చేశారు? డీఎంఈ మార్గదర్శకాలను పరిశీలించారా? ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నిబంధనలను ముందుగానే తనిఖీ చేశారా? అన్న అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అహంకారానికి ఎదురుదెబ్బ?
కేజీహెచ్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ మాత్రం వాటిని యథాతథంగా అంగీకరించలేదు. అవసరమైన అర్హతలు, ప్రస్తుత అనుబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేసి లాగిన్ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో ‘ఆస్పత్రిలో అధికారుల ఆదేశమే అంతిమమని భావిస్తే కుదరదని ట్రస్ట్ తాజా నిర్ణయం తేల్చిచెప్పింది’ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా కేజీహెచ్ యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆర్‌ఎంవో స్థాయి అధికారులకు మెడ్కో బాధ్యతలు అప్పగిస్తారా? లేక తిరిగి అదే వివాదాస్పద నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
డీఎంఈ మార్గదర్శకాలు పట్టవా?
ఎన్టీఆర్ వైద్యసేవ వంటి పరిపాలనా బాధ్యతలను సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవో వంటి అధికారులకు అప్పగించాలని డీఎంఈ గతంలో మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. క్లినికల్ స్పెషాలిటీ వైద్యులను వీలైనంత వరకు పరిపాలనా బాధ్యతల నుంచి దూరంగా ఉంచి, రోగుల చికిత్సకు వినియోగించాలన్నదే వాటి ఉద్దేశం. అయితే కేజీహెచ్‌లో పరిపాలనా వైద్యాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ న్యూరోసర్జన్‌ను ఎంపిక చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే నియామకానికి ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ లాగిన్ ఇవ్వకపోవడంతో.. ‘నిబంధనలు పట్టించుకోకుండా చేసిన నియామకానికి చివరికి ఇదే గతి పట్టింది’ అన్న చర్చ సాగుతోంది.


