పాప కిడ్నాప్ కేసులో తల్లీకూతుళ్లు, ఆటోడ్రైవర్ అరెస్ట్
అల్లిపురం(విశాఖ): తన తల్లి ఆనందం కోసం మరో తల్లి కడుపుకోతకు కారణమైన యువతితో పాటు ఆమె తల్లి, స్నేహితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రైల్వే స్టేషన్ బస్టాప్ వద్ద నుంచి నాలుగేళ్ల చిన్నారి సయ్యద్ శివపార్వతిని అపహరించిన కేసును ఛేదించిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ బండారు అప్పలనాయుడుతో కలిసి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 23న విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ అఫీజ్ గని, ఆయన భార్య సయ్యద్ శేషమ్మ విశాఖ వ్యాలీ సమీపంలోని శిశు సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న తమ 11 ఏళ్ల కుమారుడు సయ్యద్ మారయ్యను చూసేందుకు విశాఖపట్నం వచ్చారు. కుమారుడిని చూసిన అనంతరం దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె సయ్యద్ శివపార్వతితో కలిసి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి అక్కడికి వచ్చి, తల్లి పక్కనే నిద్రిస్తున్న చిన్నారి శివపార్వతిని అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలంలోని ఓ మహి ళ వద్ద ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
తల్లి ఆశ.. కూతురి తప్పుడు దారి!
చిన్నారి అపహరణ కేసులో ఎస్.రాయవరం మండలం పాపకాయలవీధికి చెందిన అన్నమదేవర వరలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో చిన్నారిని అపహరించింది తన కుమార్తె అన్నమదేవర ప్రతిభారావు, ఆమె స్నేహితుడు విజయనగరం జిల్లా గరివిడి గ్రామానికి చెందిన కొంచాడ ఉపేంద్ర అని వెల్లడయింది. వరలక్ష్మికి మొదటి భర్త ద్వారా ప్రతిభారావు జన్మించింది. అనంతరం అతడు మరణించాడు. అనంతరం రెండో వివాహం చేసుకోగా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో ఎక్కడైనా చిన్నారిని తీసుకురావాలని తన కుమార్తె ప్రతిభారావుకు రూ.30 వేలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
స్కూటీపై వచ్చి.. పాపను ఎత్తుకెళ్లి..
తల్లి కోరికను నెరవేర్చేందుకు ఇదే అవకాశంగా భావించిన ప్రతిభారావు తన స్నేహితుడు ఉపేంద్రతో కలిసి గురువారం రాత్రి రైల్వేస్టేషన్ సమీపానికి స్కూటీపై వచ్చింది. ఫుట్‌పాత్‌పై తల్లి పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల శివపార్వతిని అపహరించి ఎస్.రాయవరం తీసుకెళ్లి తన తల్లికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వరలక్ష్మి ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిభారావు, ఉపేంద్రలను తుని రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. ముగ్గురు నిందితులకు ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్ర లేదని ఆయన పేర్కొన్నారు.


