దేవరాపల్లి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేచలపు కాసుబాబు, సీపీఐ మండల కార్యదర్శి వేమల కన్నబాబు, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు గరికిన రాజు, మండల సహాయ కార్యదర్శి రాయి సింహాద్రి అప్పడు కోరారు. దేవరాపల్లిలో శనివారం ‘చలో ఢిల్లీ’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక నిత్యావసరాలతో సహా అన్ని ధరలు విపరీతంగా పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారన్నారు. తక్షణమే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాలను మెరుగుపర్చి, పంటలకు కనీస మద్దతు కల్పించేలా చట్టబద్ధత తీసుకురావాలని కోరారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లు అమలు చేసి, కార్మికుల హక్కులను పరిరక్షించాలన్న డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వా రు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్ర జలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


