మాడుగుల: నియోజకవర్గంలో రోజురోజుకు జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతుండడంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. జిల్లాలో మొత్తం 10 జలాశయాలుండగా, మాడుగుల నియోజకవర్గంలోనే అధికంగా ఏడు జలాశయాలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు 58,844 ఎకరాల్లో రెండు పంటలు పండేవి. అయితే ఈ ఏడాది వాటి పరిస్థితి దయనీయంగా మారింది. అత్యంత అధిక జలవనరులు గల పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాలతో పాటు చిన్న జలాశయాలైన పాలగెడ్డ, తారకరామ, గొరిగెడ్డ, ఉరక గెడ్డ జలాశయాలు అడుగంటడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. రిజర్వాయర్లు అడుగంటడంతో భూగర్భజలాలు తగ్గిపోయి వ్యవసాయ మోటార్లు కూడా మొరాయిస్తున్నాయి. ఇకపై వర్షాలు అనుకూలించకపోతే తాగడానికి కూడా నీరు లేకుండా పోయే పరిస్థితులు దాపురిస్తాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నియోజవర్గంలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 58,844 ఎకరాలు కాగా, ఈ ఏడాది జలాశయాలు, బోర్లు కింద కేవలం 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు.
మొరాయిస్తున్న బోర్లు
ఏటా ఆగస్టు నెలలో జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడేవి. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో నియోజకవర్గంలో ఏడు జలాశయాలతో పాటు చెరువులు ఎండిపోతుండడంతో వ్యవసాయ బోర్లు కూడా మొరాయిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నారు మడులు ఎండిపోయాయి. వర్షాలు కురవకపోవడంతో అధికశాతం మంది రైతులు నారుమడులు వేయలేదు. ప్రత్యామ్నాయంగా గంటి చేలు, వెద ద్వారా వేసిన వరి పంటలు కూడా ఎండిపోతున్నాయి. మాడుగుల నియోజకవర్గాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులును ఆదుకోవాలని, ఆయకట్టు రైతులు మొరపెట్టుకుంటున్నారు.
రైవాడ : ఆయకట్టు 15,344 ఎకరాలు,
మండలం : దేవరాపల్లి
నాట్లువేసిన ఎకరాలు : 15 వందలు(నాట్లు కొనసాగుతున్నాయి)
మాడుగుల నియోజకవర్గంలోని జలాశయాల్లోపరిస్థితి నీటి మట్టం(మీటర్లలో)
జలాశయం గరిష్ట ప్రస్తుతం ఆయకట్టు
పెద్దేరు 137 128. 70 19,000
రైవాడ 114 103.50 15,344
కోనాం 121.25 92.00 14,500
వర్షపాతం (మిల్లీమీటర్లలో)
నెల సగటు కురిసింది లోటుశాతం
జూన్ 123.2 97.5 20.9
జులై 175.9 45.4 74.2
ఆగస్టు 176.5 48.5 128
గొరిగెడ్డ, ఉరక గెడ్డ ఆయకట్టు :
3000 ఎకరాలు
మండలం : మాడుగుల
నాట్లు వేసిన ఎకరాలు : 150
పాలగెడ్డ : ఆయకట్టు 2000 ఎకరాలు
మండలాలు: మాడుగుల, చీడికాడ
నాట్లు వేసిన ఎకరాలు : పడలేదు
జలాశయాల్లో తగ్గిన నీటి మట్టం ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు
దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
మాడుగుల నియోజకవర్గంలో 58,444 వేల ఎకరాలకు సాగునీటి సమస్య
కేవలం 10 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు
జలాశయాలు నిర్మించిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితులు లేవు. పెద్దేరు జలాశయం అడుగంటడంతో 1200 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడ్డాయి. వర్షాలు కురిస్తేనే కాస్తోకూస్తో పండే అవకాశం ఉంటుంది. చినుకులు తప్ప వర్షాలు కురవడంలేదు. వర్షాలు కురుస్తాయి, జలాశయాలు నిండుతాయని ఎదురుచూస్తున్నాం.ఈ ఏడాది పంటలపై ఆశలు వదులుకోవలసిన పరిస్థితి దాపురించింది. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – చల్లా బుజ్జి, రైతు సత్యవరం
తారకరామ : ఆయకట్టు 250 ఎకరాలు
మండలం : మాడుగుల
నాట్లువేసిన ఎకరాలు 120
ఆగస్టులోనూ లోటే
ఆగస్టు నెల పూర్తవుతన్నా జిల్లాలో సరైన వర్షాలు లేవు. ఖరీఫ్ సాగుకు కీలకమైన జూన్, జులైతో పాటు, ఆగస్టులోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో సగటు వర్షపాతం 475.6 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, 284.1 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. వర్షాలు లేక, జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో వరినారుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోర్లు మొరాయిస్తున్నాయి
జలాశయాల్లో నీరు అడుగంటడంతో పాటు వర్షా లు అనుకూలించక పోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు మొరాయిస్తున్నాయి. బోర్లు కింద వేసిన నాట్లు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.ప్రత్యామ్నాయ పంటలూ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి మాడుగుల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.
– పర్రే రామునాయుడు,
రైతు. గాదిరాయి


