బెధరగొడుతున్నాయ్‌ | - | Sakshi
Sakshi News home page

బెధరగొడుతున్నాయ్‌

Aug 29 2026 12:46 AM | Updated on Aug 29 2026 12:46 AM

సాక్షి, అనకాపల్లి: జిల్లాలో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది. నింగిని తాకిన నిత్యవసర ధరలు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. నెల రోజుల వ్యవధిలో పరిశీలిస్తే అన్ని ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆరు నెలల క్రితం పశ్చిమాసియా యుద్ధ నెపంతో వంట నూనెలు, వంట గ్యాస్‌ తదితర ధరలను అమాంతంగా పెంచినప్రభుత్వాలు.. ఇప్పుడు ఎందుకు అమాంతంగా నిత్యవసర ధరలు పెంచేశారంటూ పేద, మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. సామాన్యుడు దిగులుపడుతున్నాడు. మార్కెట్‌లో అడుగు పెడితే చాలు.. ధరాఘాతంతో బెదిరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొందరు దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నా.. చంద్రబాబు సర్కారు పర్యవేక్షణ కరవైంది. ధరల నియంత్రణలో కూటమి సర్కారు పూర్తిగా విఫలమైందంటూ ప్రజలు మండిపడుతున్నారు.

కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులు

కొద్ది రోజుల క్రితం ధరలతో పోల్చి చూస్తే ఇప్పుడు అధిక శాతం నిత్యావసర సరకుల ధరలు అమాంతం పెరిగిపోయి, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయి. పంచదార, బెల్లం, ఉల్లి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై 12 శాతం టాక్స్‌ను విధించడంతో ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా పెంచారు. కొంత మంది వ్యాపారులు పలు రకాలైన వస్తువులను బ్లాక్‌ చేసి ప్రజలను దోచుకుంటున్నార న్న ఆరోపణలు వస్తున్నాయి. పంట సాగు తగ్గడం, వర్షాభావ పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ లేకపోవడం, ఎల్‌ నినో ప్రభావం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. రైస్‌ మిల్లర్లు, వ్యాపారులు బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు అక్రమంగా నిల్వ చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణాలు అవుతున్నాయి.

ఏదీ పర్యవేక్షణ?

ధరల నియంత్రణ కోసం జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు పరిశీలిస్తే.. అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలపై అధికార యంత్రాంగం ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. కనీస సమీక్షలు కూడా నిర్వహించలేదు. నిర్దేశించిన ధరల కన్నా అదనపు ధరలకు విక్రయించే వారిపై చర్యల్లేవు సరి కదా.. ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా కానరాలేదు. జిల్లాలో ధరల స్థిరీకరణపై పర్యవేక్షణ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించవలసి ఉంటుంది. ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సమావేశం జరిగిన సందర్భాల్లేవనే చెప్పుకోవచ్చు. బయట మార్కెట్‌లో ఎంఆర్‌పీకి విక్రయిస్తున్న వారి సంఖ్య చేతి వేళ్లపై లెక్కపెట్టుకోచ్చు. సామాన్య, మధ్య తరగతి వినియోగదారులను నిలువునా దోచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నా పట్టించుకొనే నాథుడే కరవయ్యాడు. ఎక్కడా పర్యవేక్షణ లేదు, తనిఖీలు లేవు, దాడులు లేవు. పండగలను దృష్టిలో పెట్టుకుని పలు రకాల నిత్యావసర వస్తువులను బ్లాక్‌ చేస్తున్నారు. బియ్యం, పప్పులు, వంట నూనెలు, బెల్లం, పంచదార అక్రమంగా నిల్వ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అనధికార నిల్వలు చేసి ఒక విధంగా చెప్పాలంటే దళారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎవరికి నచ్చిన ధరలకు వారు విక్రయిస్తున్నారు. వినియోగదారులు లబోదిబోమన్నా పట్టించుకునే వారు లేక జనాలు అల్లాడుతున్నారు.

చేదెక్కుతున్న తీపి ధరలు

శ్రావణ శుక్రవారం పూజల సందర్భంగా మార్కెట్‌లో పంచదార, బెల్లం ధరలను పోటాపోటీగా పెంచేశారు. పంచదార, బెల్లంతో పిండివంటలు ఎక్కువగా చేస్తుంటారు. దీంతో ఈ రెంటి ధరల పెరుగుదలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రస్తుతం రకాన్ని బట్టి పంచదార ధర కిలో రూ.40–45 నుంచి రూ.70–72 వరకు పెరిగింది. 30 రోజుల క్రితం ఉన్న ధరలతో నేటి ధరలను పోల్చితే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. బెల్లం ధర కిలో రూ.90 పైనే పలుకుతోంది. గతంలో రూ.50 ఉండేది, ఇప్పుడు రకాన్ని బట్టి రూ.70 నుంచి రూ.90కి విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా రూ.16 నుంచి రూ.36 వరకు పెరిగింది.

కంటినీరు తెప్పిస్తున్న ఉల్లి, వెల్లుల్లి

నెల రోజులుగా ఉల్లిపాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో రూ.35 ఉండే ధర ఇప్పుడు రూ.70కి చేరుకుంది. రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.70 వరకూ విక్రయిస్తున్నారు. వెల్లుల్లి ధర కూడా కిలోపై రూ.50 పెరిగింది.

‘క్రూర’ గాయలు

జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పచ్చిమిర్చి నుంచి టమాటా వరకూ అన్నింటి రేట్లు పెరిగాయి. ఉల్లి, వెల్లుల్లి రేట్లు చూస్తే కన్నీళ్లొస్తున్నాయి. పచ్చిమిర్చి, బీన్స్‌, చిక్కుడు, ఆగాకరకాయ, బంగాళదుంప, అల్లం రేట్లు భారీగా పెరిగాయి. రైతుబజారుకు రూ.1,000 పట్టుకొని వెళ్తే.. సంచి నిండుగా కూరగాయలు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక బయట మార్కెట్‌కు వెళ్తే సరేసరి.. సంచిలో సగం కాదు కదా.. అడుగు భాగానికి కూడా రావడం లేదు.

నిత్యావసర వస్తువులు

పాత ధరలు ప్రస్తుత ధరలు

(కిలో రూ.లలో)

పంచదార 40 – 45 70 – 72

బెల్లం 45 – 50 75 – 90

సన్‌ఫ్లవర్‌ నూనె 172 180

గోల్డ్‌ డ్రాప్‌ 170 180

పామాయిల్‌ 120 126

శనగపప్పు 75 90

ధనియాలు 180 350

కందిపప్పు 120 130

మినపప్పు 120 135

కూరగాయలు

టమాటా 20 – 30 40 – 50

ఉల్లి 25 – 35 50 – 70

వెల్లుల్లి 110 160

పచ్చిమిర్చి 40 – 50 90 – 120

బీన్స్‌ / చిక్కుడు 40 – 50 80 – 120

బంగాళాదుంప 20 – 25 30 – 40

అల్లం 80 – 100 180 – 220

బియ్యం (25 కిలోలు)

రూ. 1,000 – 1,050 రూ. 1,600 – 1,700

(లలిత)

ఇతర రకాల బియ్యం రూ. 1,200– 1,650

వంటింటి నుంచి శుభకార్యక్రమానికి అవసరమయ్యే అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు, బియ్యం, చక్కెర, బెల్లం, నూనెలు ఇలా ప్రతి వస్తువు ధర పెరిగిపోవడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. నెలవారీ ఇంటి బడ్జెట్‌ తలకిందులైందని సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement