ఏసీబీ వలలో సబ్‌ ట్రెజరీ సీనియర్‌ అకౌంటెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సబ్‌ ట్రెజరీ సీనియర్‌ అకౌంటెంట్‌

Aug 29 2026 12:46 AM | Updated on Aug 29 2026 12:46 AM

రిటైర్మెంట్‌ బిల్లులు క్లియర్‌ చేసేందుకు రూ.40 వేలు డిమాండ్‌

లంచం తీసుకుంటుండగారెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

నర్సీపట్నం: పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేసేందుకు విశ్రాంత తహసీల్దార్‌ వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా నర్సీపట్నం సబ్‌ ట్రెజరీ కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ విజయభాస్కర్‌ను అవినీతి నిరోధకశాఖ వలపన్ని పట్టుకుంది. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ ఎస్‌.ఆర్‌.హర్షిత తెలిపిన వివరాల మేరకు... రిటైర్‌మెంట్‌ బిల్లులు, ఆర్జిత సెలవుల బిల్లులను సంబంధిత అధికారి పనిచేసిన కార్యాలయం నుంచి సబ్‌ ట్రెజరీకి పంపించారు. ఆ బిల్లులు మంజూరు చేసేందుకు సబ్‌ ట్రెజరీ సీనియర్‌ అకౌంటెంట్‌ ఎన్‌.విజయ్‌భాస్కర్‌ రిటైర్డ్‌ మండల లెవెల్‌ అధికారిని రూ.40 వేలు లంచం ఇవ్వాలని, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు మంజూరు చేయడం జరగదని చెప్పాడు. లంచం ఇవ్వలేదని బిల్లు రిజెక్ట్‌ చేశాడు. దీంతో రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. తమ సూచన మేరకు రూ.30 వేలు లంచం ఇస్తుండగా విజయ్‌భాస్కర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు చెప్పారు. నర్సీపట్నం కొత్తవీధిలో నివాసం ఉంటున్న విజయ్‌భాస్కర్‌ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న విజయ్‌భాస్కర్‌ను రిమాండ్‌ నిమిత్తం శనివారం విశాఖ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 11 ఏసీబీ కేసులు నమోదు చేశామని, లంచం ఎవరు డిమాండ్‌ చేసినా నిర్భయంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని అడిషనల్‌ ఎస్పీ హర్షిత చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు బి.వి.ఎస్‌.ఎస్‌.రమణమూర్తి, ఎ.పృథ్వీరాజ్‌, సీఐలు లక్ష్మణరావు, శ్రీనివాస్‌, సుప్రియ, వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement