ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి

Aug 29 2026 12:46 AM | Updated on Aug 29 2026 12:46 AM

మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ఆగ్రహం

దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి, సమ్మెద గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా దేవరాపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, గిరిజనుల భూములను పట్టణ ప్రాంతానికి చెందిన పెత్తందారులు దర్జాగా కబ్జా చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి వచ్చే ముడుపులకు ఆశపడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు, హక్కు పత్రాలు లేకుండానే 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, బంజరు భూములను, డీ–పట్టా భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపించారు. వాలా బు, గరిశింగి పంచాయతీల పరిధిలో సైతం విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను చెరబడుతున్నారని విమర్శించారు. దళిత, గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన బంజరు భూములు అన్యాక్రాంతమవుతున్నా చోద్యం చూడటం దారుణమన్నారు. ఆక్రమించిన అసైన్డ్‌ భూములకు రెవెన్యూ అధికారులు ఫారం–3 ఇచ్చి బోర్లు వేయిస్తున్నారన్నారు. ఈ ఆక్రమణలపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫిర్యాదుదారునికి తప్పుడు ఎండార్స్‌మెంట్‌ ఇచ్చి సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎక్కడా చూడలేదన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను రక్షించాలని, లేకుంటే తామే ఎర్ర జెండాలు పాతి ఆ భూములను పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement