మాకవరపాలెం: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండగ జరుపుకొంటారు. అయితే మండలంలోని తూటిపాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్నంగా శుక్రవారం విద్యార్థులతో మొక్కలకు రాఖీలు కట్టించారు. వృక్షాలను సంరక్షిస్తే అవి మనకు రక్షణగా నిలుస్తాయని హెచ్‌ఎం భీమారావు, ఉపాధ్యాయుడు రాము చెప్పారు. విద్యార్థులకు చిన్నవయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టించామని తెలిపారు.
అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన ఎరుకువానిపాలెం ఎంపీయూసీ స్కూల్ ఆవరణలో చెట్లకు శుక్రవారం విద్యార్థులు రాఖీలు కట్టారు. చెట్లను సోదరులుగా భావించి రక్షించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషన్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం కె.పి.బి.శ్రీధర్, ఉపాధ్యాయులు జయశ్రీరాణి, సుజాత, ఉమ, కృష్ణారావు, మూర్తి, ఎస్‌ఎంసీ చైర్మన్ అరిగా శ్రీను తదితరులు పాల్గొన్నారు.


