తలవంచిన అనకొండలు | - | Sakshi
Sakshi News home page

తలవంచిన అనకొండలు

Aug 28 2026 12:27 AM | Updated on Aug 28 2026 12:27 AM

సాక్షి, అనకాపల్లి: కొండలు మింగే ఘనులకు చెక్‌ పడింది. పవిత్ర పంచదార్ల (ఫణిగిరి) పర్వతం కేవలం ఒక కొండ కాదు.. వేల ఏళ్లుగా భక్తుల దాహాన్ని తీరుస్తూ, ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతున్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం. పంచదార్ల కొండ గుండెల్లోంచి ఉద్భవించి, భక్తులపై పుణ్యజలాలను చిలకరించే ఆ ఐదు పవిత్ర జీవధారలను కాపాడుకోవడానికి జరిగిన ధర్మపోరాటం చివరకు విజయం సాధించింది. అభివృద్ధి ముసుగులో కూటమి నేతలు జరిపిన అక్రమ తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పంచదార్ల కొండను అధికారికంగా ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటిస్తూ గురువారం ప్రభుత్వం జీవో 226ను జారీ చేసింది. ఈ ప్రకటనపై స్థానిక ప్రజలు, వైఎస్సార్‌సీపీ కేడర్‌, నాయకత్వం చేసిన ప్రజా పోరాట ఫలితమే ఈ నో మైనింగ్‌ జోన్‌ ప్రకటన అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు వెల్లడించారు.

వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌న్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యలమంచిలి సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా నాయకులు నెల రోజుల పాటు తీవ్ర ఉద్యమం చేపట్టారు. ఉమ్మడి జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలంతా చేపట్టిన ఉద్యమ ఫలితంగా పంచదార్ల కొండను నో మైనింగ్‌ జోన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూలై నెల 1వ తేదీ నుంచి పలు మార్లు ఎమ్మార్వో నుంచి జిల్లా మైనింగ్‌ శాఖ అధికారి వరకూ పలు వినతులు అందజేశారు. జూలై 18 నుంచి రెండు రోజుల పాటు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేశారు. పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. జూలై 21న ‘చలో పంచదార్ల’ పేరిట అనకాపల్లిలో గల వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పంచదార్ల వరకూ భారీ బైక్‌, కార్ల ర్యాలీ చేట్టారు. పంచదార్ల కొండ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ నేతృత్వంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ తదితర నేతలంతా హాజరై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.

నో మైనింగ్‌ జోన్‌గా పంచదార్ల కొండ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

పంచదార్ల కొండపై ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ పత్రిక పవిత్ర పంచదార్లని కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతల పోరుబాట సాక్షి కథనాలతో ఇరకాటంలో పడిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ‘నో మైనింగ్‌ జోన్‌’గా గుర్తిస్తూ జీవో జారీ

ఉద్యమానికి భారీగా ప్రజా మద్దతు

ఈ ఉద్యమానికి ప్రజల నుంచి భారీగా మద్దతు రావడంతో కూటమి ప్రభుత్వం తన తప్పులకు తలవంచక తప్పలేదు. అంతటితో ఆగలేదు. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలంతా వెళ్లి కేంద్ర మంత్రికి వినతి అందజేశారు. నెల రోజుల పాటు వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి కూటమి ప్రభుత్వం తలొగ్గి పంచదార్ల కొండను నో మైనింగ్‌జోన్‌ ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ నేతృత్వంలో చేసిన పోరాటానికి, వైఎస్సార్‌సీపీ కేడర్‌ అలుపెరగని పోరాటానికి ప్రభుత్వం తలవంచక తప్పలేదు. రాజ్యసభ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, బొడ్డేడ ప్రసాద్‌ ఢిల్లీలో కేంద్ర మంత్రి దృష్టికి పంచదార్ల సమస్యలను తీసుకెళ్లారు. ఎట్టకేలకు గురువారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో.226 ద్వారా పంచదార్ల తీర్థయాత్ర కొండలను ‘నోమైనింగ్‌ జోన్‌గా’ అధికారికంగా ప్రకటించింది.

పంచదార్ల గ్రామంలోని సర్వే నం.1లో 2.153 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్న దాసమ్నాని విజయ్‌కుమార్‌ నాయుడు క్వారీ లీజును రద్దు చేసి, పంచదార్ల కొండ పరిధి నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించారు. కూటమి ప్రజాప్రతినిధుల అధర్మ పనులకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం ఫలితమే పంచదార్ల కొండ పరిధిని ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించడం. పంచదార్లను పచ్చ గెద్దలు దోచుకు తింటుంటే..సాక్షాత్‌ ఆ పరమశివుడే తనను మా అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో ఉద్యమం వైపు నడిపించారు. పంచదార్లను ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించే వరకూ అలుపెరగని పోరాటం చేశాను. ఈ పోరాటం ఇంతటితో ఆగేది లేదు. గతంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అందులో ప్రమేయం ఉన్న అధికారులు, పెద్దస్థాయి అధికారులను వదిలేసి చిరు స్థాయి ఉద్యోగులను సస్పెండ్‌ చేసి చేతులు దులిపేసుకున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై మైనింగ్‌ శాఖ వేసిన పెనాల్టీ రూ.4 లక్షల్లో ఒక్క పైసా కూడా వారు చెల్లించలేదు. ఉద్యమం రోజు కూడా మైనింగ్‌ తవ్వకాలకు అనుమతి పొందిన మరో క్వారీపై సర్వేయర్‌ లేరంటూ సర్వే జరగలేదంటూ లక్షీ మినరల్స్‌ పేరిట చేసిన అక్రమ తవ్వకాలపై కూడా పెనాల్టీ విధించాలి. ఇదే రాంబిల్లి మండలంలో రాముకొండపై కూడా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. వారిపై కూడా మైనింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలి. లేదంటే కూటమి అధర్మ పనులపై నిరంతర పోరాటం చేయక తప్పదు. –కరణం ధర్మశ్రీ, యలమంచిలి సమన్వయకర్త

సాక్షి కథనాలకు తలొగ్గిన ప్రభుత్వం

అభివృద్ధి ముసుగులో పంచదార్ల కొండను కూటమి నేతలు అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు పాల్పడ్డారు. కనీసం మైనింగ్‌శాఖ అనుమతులు కూడా లేకుండానే రాత్రి, పగలు తేడా లేకుండా 3–4 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర అక్రమ తవ్వకాలు చేపట్టారు. అయితే, దీనిపై స్థానికంగా గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఇచ్చినా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో పారిశ్రామిక పార్కు పేరుతో గ్రావెల్‌ తరలింపు కోసం మైనింగ్‌ అనుమతులు మంజూరు చేశారు. పవిత్రమైన పంచదార్ల కొండపై నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ ఎలా చేపడతారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తే..ఎవరైనా అడ్డుగా వస్తే లారీలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో కూటమి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల అండదండలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండపై ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాల అంశాన్ని వరుస కథనాలతో ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. సాక్షి కథనాలతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement