జీతాల కోసం కశింకోట ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ అధ్యాపకుల రిలేదీక్షలు
వారికి మద్దతుగా విద్యార్థుల ఆందోళన
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు
కళాశాల సమస్య పరిష్కరించాలని డిమాండ్
కశింకోట: కశింకోటలోని ఆర్‌ఈసీఎస్ (అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకారం సంఘం) ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ గురువారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా కళాశాల విద్యార్థులు కూడా నిలిచి ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కళాశాలలో పనిచేస్తున్న 46 మంది అధ్యాపక సిబ్బందికి గత జులై నెల జీతం చెల్లించకుండా నిలిపివేయడం, నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన ఇతర సదుపాయాలను కల్పించపోవడంతో ఈనెల10న అధ్యాపక, సిబ్బంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు స్పందించి ఈ నెల 20లోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే హామీ మేరకు ఎటువంటి చర్యలు చపట్టకపోవడం, జీతాలు ఇవ్వబోమని, కళాశాల నిర్వహణ బాధ్యత తమకు లేదని ఈపీడీసీఎల్ అధికారులు తెగేసి చెబుతుండడంతో అధ్యాపక సిబ్బంది మళ్లీ ఆందోళన బాట పట్టారు. గురువారం ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేశారు. ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ శివ, అధ్యాపక సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు శరగడం హేమంత్, కార్యదర్శి భీమిశెట్టి నగేష్ తదితరులు మాట్లాడుతూ ఆర్‌ఈసీఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలను 2009లో ఏర్పాటు చేశారన్నారు. అధ్యాపక సిబ్బంది జీతాలను, ఇతర ఖర్చులను 2021 వరకు సంస్థ భరించిందన్నారు. అయితే 2021లో ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు ఆర్‌ఈసీఎస్ ఆపరేషన్స్‌ను ఏపీఈపీడీసీఎల్ స్వాధీనం చేసుకోవడంతో సమస్య మొదలైంది. ఈపీడీసీఎల్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఈసీఎస్ కార్యకలాపాలతో పాటు రూ.110 కోట్ల నిల్వలు, ఆస్తులను, విద్యుత్ సరఫరా ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుందని, కానీ ఆర్‌ఈసీఎస్ నిధులతో నడిచే పాలిటెక్నిక్ కళాశాల బాధ్యతను మాత్రం తీసుకోవడం లేదన్నారు. కళాశాల నిర్వహణ బాధ్యత వహించడానికి, తమకు జీతాలు చెల్లించడానికి ససేమిరా అంటుండడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కల్పించుకొని విద్యార్థుల భవిష్యత్, అధ్యాపక సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కరించాలన్నారు.
అధ్యాపకులకు మద్దతుగా విద్యార్థుల ఆందోళన
అధ్యాపకులు, సిబ్బంది ఆందోళనకు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బాసటగా నిలిచారు. విద్యార్థులు ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి కళాశాల అధ్యాపక సిబ్బంది జీతపు బకాయిల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య వల్ల తమకు పాఠాలు సవ్యంగా సాగక ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను సత్వరమే పరిష్కరించి తమ భవిష్యత్‌కు పూర్తి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఈసీఎస్ ఎండీ, ఏపీఈపీడీసీఎల్ సూపరింటిండెంటింగ్ ఇంజినీర్ జి.ప్రసాద్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు వెనుదిరిగారు.


