విశాఖ రైల్వే డివిజన్‌లో ప్రయాణికుల రాకపోకలు తగ్గుముఖం జూలైలో రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితం 26.7 లక్షల మంది మాత్రమే రాకపోకలు జూన్ కంటే 3 శాతం తగ్గుముఖం సగటు ఆదాయంలో మాత్రం విశాఖదే పైచేయి జూలైలో రూ.76.83 కోట్ల ఆదాయార్జన
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల రాకపోకలతో.. నిత్యం కిటకిటలాడే ప్లాట్‌ఫారాలతో విశాఖపట్నం రైల్వే డివిజన్ ఎప్పుడూ ముందువరసలో ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన మార్పు కనిపించింది. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పడిపోయినప్పటికీ, రైల్వే శాఖకు అత్యంత కీలకమైన ‘సగటు ఆదాయం’ విషయంలో మాత్రం డివిజన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తక్కువ మంది ప్రయాణించినా, రైల్వే ఖజానాకు మాత్రం డివిజన్ నుంచి భారీగానే ఆదాయం సమకూరడం గమనార్హం.
ఈసారి మూడో స్థానమే..
ఈ ఏడాది జూలై 2026కు సంబంధించిన తాజా అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. విశాఖపట్నం రైల్వే డివిజన్ మొత్తం 2.67 మిలియన్ల (26.7 లక్షల) మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇందులో రిజర్వేషన్ ద్వారా 0.87 మిలియన్లు, అన్‌రిజర్వ్‌డ్ ద్వారా 1.80 మిలియన్ల మంది ప్రయాణించారు. ఇదే సమయంలో పొరుగున ఉన్న విజయవాడ డివిజన్ ఏకంగా 6.55 మిలియన్ల ప్రయాణికులతో అగ్రస్థానంలో నిలవగా, గుంతకల్లు డివిజన్ కూడా 3.59 మిలియన్లతో విశాఖను మూడో స్థానానికి నెట్టేసి రెండో స్థానానికి ఎగబాకింది. కేవలం 1.60 మిలియన్లతో గుంటూరు డివిజన్ మాత్రమే విశాఖ కంటే వెనుకబడింది. జూన్‌తో పోలిస్తే విశాఖ డివిజన్‌లో ప్రయాణికుల రాకపోకలు 3 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.
సగటు ఆదాయంలో మాత్రం సూపర్
ప్రయాణికుల రద్దీలో విజయవాడ, గుంతకల్లు డివిజన్ల కంటే వెనుకబడిన ప్పటికీ.. ఒక్కో ప్రయాణికుడి ద్వారా వచ్చే సగటు ఆదాయాన్ని విశ్లేషిస్తే విశాఖ రైల్వే డివిజన్‌దే పైచేయి కావడం విశేషం. జూలై నెలలో విశాఖ డివిజన్ మొత్తం రూ.76.83 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో రిజర్వ్‌డ్ ప్రయాణికుల ద్వారా రూ.61.94 కోట్లు, అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికుల ద్వారా రూ.14.89 కోట్లు ఖజానాకు వచ్చి చేరాయి. అంటే సగటున లెక్కగడితే విశాఖ డివిజన్‌లో ఒక్కో ప్రయాణికుడు రూ.287 చొప్పున రైల్వేకు చెల్లించారు. అదే విజయవాడలో అత్యధికంగా రూ.135.83 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ, అక్కడి సగటు ఆదాయం రూ.207 మాత్రమే. గుంతకల్లు డివిజన్‌లో సగటు ఆదాయం సుమారు రూ.270 కాగా, గుంటూరు డివిజన్‌లో అది కేవలం రూ.137గా నమోదైంది.
ఎందుకు దూరమవుతున్నారు?
గతంలో వాల్తేరు డివిజన్‌గా ఉన్న ప్రాంతాన్ని రెండుగా విభజించి.. ఒకటి విశాఖ డివిజన్‌గా, మరొకటి రాయగడ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ఇదే విశాఖలో ప్రయాణికుల రాకపోకలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులు రైళ్లకు దూరమవ్వడం కూడా మరో కారణమని చెబుతున్నారు. వేసవి సెలవులు ముగియడం ఒక కారణమైతే.. సాధారణ రైళ్లలో జనరల్, స్లీపర్ కోచ్‌ల సంఖ్యను తగ్గించి ఏసీ కోచ్‌లను పెంచడం మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో తక్కువ ధరలో ప్రయాణించే అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికుల సంఖ్య కేవలం 1.80 మిలియన్లకే పరిమితమైంది.
ప్రీమియం రైళ్ల హవా
మరోవైపు సగటు ఆదాయం పెరగడానికి వందేభారత్ వంటి ప్రీమియం రైళ్ల రాక ప్రధాన కారణం. ఈ తరహా రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆక్యుపెన్సీ రేటు అత్యధికంగా ఉంటోంది. అందుకే తక్కువ మంది ప్రయాణించినా ఆదాయం గణనీయంగా వస్తోంది. విశాఖ రైల్వేస్టేషన్‌లో శరవేగంగా జరుగుతున్న భారీ పునరాభివృద్ధి పనుల కారణంగా ప్లాట్‌ఫారాలు, పార్కింగ్ ప్రాంతాల్లో కొంత అసౌకర్యం నెలకొంది. ఇది కూడా స్థానిక ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడానికి కారణమవుతోంది. ప్రస్తు తం నెలకొన్న ఈ స్తబ్దత తాత్కాలికమేనని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రిజర్వ్‌డ్ కేటగిరీ ద్వారా రూ.61.94 కోట్ల అత్యధిక ఆదాయం రావడం.. సుదూర ప్రయాణాలకు ప్రజలు విశాఖ డివిజన్‌పైనే ఆధారపడుతున్నారనడానికి నిదర్శనం. రానున్న దసరా, దీపావళి పండుగల సీజన్ నాటికి విశాఖ స్టేషన్‌లో కొన్ని మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆదాయం రికార్డు స్థాయిలో నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


