కె.కోటపాడు: ఎంఎస్‌ఎంఈ పార్కు పేరిట నిబంధనలను పాటించకుండా రైతుల భూములను బలవంతంగా అధికారులు లాక్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారని సీపీఎం నాయకుడు గండి నాయినిబాబు అన్నారు. గొండుపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం గుర్తించిన భూముల రైతులతో కలిసి గురువారం వీరు నిరసన కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా నాయినిబాబు మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్‌ను ఇవ్వకుండా రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. రైతుల నుంచి తీసుకుంటున్న భూముల్లో జిరాయితీ పట్టా ఎకరానికి రూ.20 లక్షలు, పట్టాలేని భూములు ఎకరానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు రైతులకు స్థానిక టీడీపీ నాయకులు చెబుతున్నారని నాయినిబాబు ఆరోపించారు. రైతులు భూములు ఇవ్వబోమని చెప్పినా రెవెన్యూ అధికారులు నోటీసులు పంపుతున్నారని అన్నారు. ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఈర్లె నాయుడుబాబు, రొంగలి ముత్యాలనాయుడు, రైతులు సీముసిరి రాము, ఆర్.గోవింద, నాగమణి, రాము పాల్గొన్నారు.
గొండుపాలెంలో రైతులతో కలిసి
సీపీఎం నిరసన


