చీడికాడ: నెలలు నిండిన గర్భిణి ప్రసవ నొప్పులతో 108 వాహనంలో మార్గమధ్యంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన మండలంలోని అర్జునగిరిలో బుధవారం చోటు చేసుకుంది. 108 పైలట్ లెక్కల ముత్యాలనాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. అర్జునగిరికి చెందిన వై.రాణికి బుధవారం ఉదయం 6.35 గంటలకు పురుటి నొప్పులు ప్రారంభమైనట్టు తమకు సమాచారం అందడంతో చీడికాడ నుంచి అర్జునగిరి 6.55 గంటలకు చేరుకునిన్నామని, గర్భిణిని 108 వాహనంలో సమీపంలో గల పెదగోగాడ పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో తమ వాహనంలో గల ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్)లెక్కల వరలక్ష్మి సూచనల మేరకు వాహనాన్ని పక్కకు తీసామన్నారు. ఈఎంటీ, ఆశాకార్యకర్త పి.మంగ సహకారంతో పురుడు పోసారన్నారు. రాణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే రాణికి ఇది రెండవ కాన్పు అని, మొదటి కాన్పు సిజేరియన్ కాగా రెండో కాన్పు నార్మల్ డెలివరి అయిందని అన్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా పెదగోగాడ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.


