చీడికాడ: మండలంలోని మంచాల మోడల్ స్కూల్‌కు విద్యార్థులను తరలించే బస్సును పునరుద్ధరించాలని సీఐటీయు మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు కోరారు. బుధవారం ఆయన విద్యార్థులు కోనాంలో చేపట్టిన నిరసనకు మద్దతు పలికారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా గల మంచాల మోడల్ స్కూల్‌కు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు గల విద్యార్థులు చీడికాడ మండలంలోని వరాహపురం, చినగోగాడ, జి.కొత్తపల్లి, చీడికాడతో పాటు కోనాం, చినకోనాం, శిరిజాం, ఖండివరం, అప్పలరాజుపురం, బి.సింగవరం, జైతవరం విద్యార్థులు ఉదయం, సాయంత్రం ఈ బస్సులోనే స్కూళ్లకు వెళుతుంటారన్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల వరకు నడిచిన బస్సు సెలవుల అనంతరం నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ పాఠశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికే నిరుపేద విద్యార్థులకు ఉపకరించే బస్సును నిలిపివేశారని ఆరోపించారు. ఈ బస్సును పునరుద్ధరించాలని ఇప్పటికే పాఠశాల పీఎంసీ, తల్లిదండ్రుల సంతకాలతో ఎమ్మెల్యే బండారు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పటికై నా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి వెంటనే బడి బస్సును పునరుద్ధరించాలని కోరారు.


