పాముకాటు.. నాటు వైద్యంతో చేటు | - | Sakshi
Sakshi News home page

పాముకాటు.. నాటు వైద్యంతో చేటు

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

● చిన అప్పన్నపాలెంలో యువకుడి విషాదాంతం

బుచ్చెయ్యపేట : మండలంలో గల చిన అప్పనపాలెం గ్రామంలో పాము కాటుకు గురైన యువకుడు నాటు వైద్యాన్ని ఆశ్రయించి బలైపోయాడు. గ్రామానికి చెందిన పైల దేవి ప్రసాద్‌ (19) సోమవారం సాయంత్రం తన పశువులను మేతకు పొలంలోకి తోలుకెళ్లాడు. పొలంలో పశువులను మేపుతుండగా కాలికి చుట్టుకుని పాము కాటు వేసింది. వెంటనే దేవి ప్రసాద్‌ పామును చేతితో పట్టుకుని దూరంగా విసిరేసి, పాము కాటు వేసిందని కేకలు వేయడంతో దగ్గరలోనే పశువులను మేపుతున్న వారు వచ్చి పామును చంపేశారు. కాటు వేసిన పామును రక్త పొడ విష సర్పంగా గుర్తించారు. వెంటనే దేవి ప్రసాద్‌ను ఆసుపత్రికి వైద్య సేవలకు తరలిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన నాటు వైద్యుడు తాను మందు వేస్తానని వారిని నమ్మ బలికాడు. అతడి మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు దేవి ప్రసాద్‌కు పసర మందులు వేయించారు. రాత్రి గడిచేకొద్ది పాము విషం దేవి ప్రసాద్‌ శరీరం అంతా వ్యాపించి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తెల్లవారుజాము ఐదున్నర గంటల ప్రాంతంలో ఆటోలో బుచ్చెయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి దేవి ప్రసాద్‌ను తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించాలని సూచించగా, అక్కడికి తీసుకెళ్లడంతోనే దేవీప్రసాద్‌ మృతిచెందాడు. దీంతో సకాలంలో దేవి ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడని కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దేవీప్రసాద్‌ తండ్రి అప్పలనాయుడు ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందగా తల్లి సన్యాసమ్మ కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషించుకుంటుంది. చిన్న వాడైన దేవి ప్రసాద్‌ ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేశాడు. తల్లికి పొలం పనుల్లో చేదోడుగా ఉంటున్నాడు. పశువులను మేపుతూ పాడి ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. సోమవారం ఉదయం తనకు స్కాలర్‌షిప్‌ పడిందో లేదోనని తెలుసుకోవడానికి తల్లి సన్యాసమ్మను తీసుకుని వడ్డాది బ్యాంక్‌కు వెళ్లి వచ్చాడు. అమ్మను ఇంటి వద్ద దించేశాడు. సాయంత్రం అమ్మా నేను పశువులను మేతకు తీసుకెళ్తానని చెప్పి పొలంలోకి వెళ్లిపోయాడు. పశువులను తోలుకెళ్లిన కొడుకు పాము కాటుకు గురై మృతి చెందడంతో ఆమె భోరున విలపిస్తుంది. భర్త అనారోగ్యంతో మృతి చెందాడు.. ఇప్పుడు అందివచ్చిన చెట్టంత కొడుకు పాము కాటుతో మృతి చెందాడు.. నేను ఏం పాపం చేశాం దేవుడా ! అంటూ దేవి ప్రసాద్‌ తల్లితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. దేవీ ప్రసాద్‌ మృతదేహానికి అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం చిన అప్పనపాలెంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాము కరిస్తే సరైన వైద్య సేవలు అందించకుండా నాటు వైద్యం చేయించడమే ఆ యువకుడిని బలితీసుకుందని మృతుడి బంధువులు, స్నేహితులు వాపోయారు. ఇటీవల చిన మదీనకు చెందిన 35 ఏళ్ల యువకుడికి పాము కాటు వేయగా నాటు వైద్యం చేయించగా అతను మృతి చెందాడు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఇలాంటివి జరుగుతున్నా అక్కడున్న అధికారులు, స్వచ్ఛంద సంస్ధలు, యువత, నాయకులు, అభ్యుదయ వాదులు ఇలాంటి వాటిని రూపుమాపడానికి సరైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement