నక్కపల్లి : తమను రెగ్యులర్ చేయాలంటూ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్టర్ వైద్య సిబ్బంది మంగళవారం ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మెబాట పడతామని నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని దశల వారీగా ఉద్యమబాట పడతామని వారు హెచ్చరించారు. మంగళవారం నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పోలీసులకు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర సంఘం సూచనల మేరకు తమ న్యాయపరమైన కోర్కెలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకుండా తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు. త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని అవసరమైతే విధులకు రాకుండా నిరసన కొనసాగిస్తామన్నారు. ఉద్యోగులకు 100 శశాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఈపీఎస్ సదుపాయం కల్పించాలని, హెల్త్‌కార్డు మంజూరు చేయాలని, రిక్వెస్ట్ బదిలీలకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి టౌన్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. స్ధానిక ఎన్టీఆర్ ఆసుపత్రి ఆవరణలో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేసే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, ఉద్యోగుల రిక్వెస్టెడ్ ట్రాన్స్‌ఫర్లను మంజూరు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ రాజాబాబు, కార్యదర్శి జయరత్నం తదితరులు పాల్గొన్నారు.


