పులపర్తిలో రైతులకు సూచనలిస్తున్న
జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి
యలమంచిలి రూరల్ : రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. యలమంచిలి మండలం పులపర్తిలో మంగళవారం పొలం పిలుస్తోంది.. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వరి సాగు చేస్తున్న పంట పొలాలను పరిశీలించి రైతులకు సాగులో సూచనలు ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో 50 శాతం వర్షపాతం లోటు ఉండని, నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారన్నారు. మిగిలిన రైతులు ప్రత్యామ్నాయ పంటలైన జనుము, రాగులు, జొన్నలు, గంటెలు సాగు చేపట్టాలని సూచించారు. వరి నాట్లు పూర్తి చేసిన రైతులంతా ఫసల్ బీమా యోజన కింద బీమా చేయించుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. యలమంచిలి వ్యవసాయాధికారి పొలిమేర మోహన్‌రావు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.


