● అస్వస్థతతో కాంట్రాక్ట్ స్వీపర్ వీరబాబు మృతి
● గోప్యంగా ఉంచిన అధికారులు, పోలీసులు
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో విషాద ఘటన చోటుచేసుకుంది. కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ స్వీపర్ దడాల వీరబాబు(45) అకస్మాత్తుగా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీఎం పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే జిల్లాలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న స్వీపర్లను ఎ.కోడూరుకు విధుల నిమిత్తం తీసుకెళ్లారు. వీరబాబు కూడా ఈ నెల 20న అక్కడికి చేరుకుని పరిశుభ్రత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ఆయన శనివారం ఉదయం నుంచే తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు సహచరులు తెలిపారు. వెంటనే అతన్ని కె.కోటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సభ ముగిసిన అనంతరం ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వీరబాబు రాకపోవడంతో సహచరులు ఫోన్ చేయగా, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. పాయకరావుపేట సచివాలయంలో కాంట్రాక్ట్ స్వీపర్‌గా పనిచేస్తున్న వీరబాబే కుటుంబానికి ఆధారం. ఆయనకు భార్యతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై అధికారులు, పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


