సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా క్రికెట్ కన్సల్టెంట్ మిథాలీరాజ్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తరంపూజ నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రంలను ఈవో జల్లేపల్లి వెంకటరావు అందజేశారు. మిథాలీరాజ్‌తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గేమ్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ ఎమ్.ఎస్.కుమార్, మహిళల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎన్.గీత, విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఆర్.గౌరీశంకర్, ఏసీఏ సీనియర్ ఉమెన్ టీమ్ హెడ్ కోచ్ షర్భానీ డెబ్‌నాఽథ్ స్వామిని దర్శించుకున్నారు.


