దొంగ మస్తర్లతో నిధులు స్వాహా
వివాహమైన రోజు వరుడు ఉపాధి పనికి వెళ్లినట్టు రికార్డుల్లో నమోదు
వెలుగు చూస్తున్న అక్రమాలు
పనిలోకి రాని వారిని విచారణకు తీసుకొచ్చి తప్పుడు వాంగ్మూలాలు
విచారణలో ఉద్రిక్తత
వీఆర్పీ భార్యపై టీడీపీ నేత దాడిపై పోలీసులకు ఫిర్యాదు
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేటలో జాతీయ ఉపాధి హామీ పథకంలో దొంగ మస్తర్లతో లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. ఉపాధి పనుల్లో దొంగ మస్తర్లకు తావు లేకుండా పని చేసే ప్రదేశంలోనే కూలీలకు ఫేషియల్‌తో హాజరు తీసుకొచ్చినా బినామీ మస్తర్లు నమోదు చేసి నిధులు పక్కదారి పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నా అధికారులకు పట్టడం లేదు. బుచ్చెయ్యపేట శివారు గ్రామాలు నేతవానిపాలెం, ఐయితంపూడికి వీఆర్పీ కొళ్లి కశింనాయుడు ఒక్కడే పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఐయితంపూడి, నేతవానిపాలెం, బుచ్చెయ్యపేటలో ఉన్న పాత మేట్లను తొలగించి కొత్తగా కూటమి నేతలను మేట్లుగా చేర్చారు. ఉపాధి కూలీల హాజరు నమోదును కొతమంది మేట్లకు యాప్‌లో నమోదు చేసేలా వీలు కల్పించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన వీఆర్పీ కొళ్లి కశింనాయుడును తొలగించడానికి కూటమి నేతలు స్కెచ్ వేశారు. పనికి రాని కొంతమందిని ఉపాధి పనులకు వచ్చినట్టు నమోదు చేసి ఉపాధి డబ్బులు పక్కదారి పట్టించారు. ఇదంతా వీఆర్పీ చేసినట్టు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం గ్రామ సచివాలయం వద్ద ఎంపీడీవో శివ ప్రసాద్ నారాయణ విచారణ చేపట్టారు. బుచ్చెయ్యపేటలో సుమారు 50 గ్రూపులు ఉండగా రోజుకు వెయ్యి మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. గ్రామానికి చెందిన శనివాడ నాగలక్ష్మి మేట్‌గా ఉంది. ఈమె హైదరాబాద్‌లో ఉండగా ఆయన భర్త శ్రీనివాసరావు మేట్‌గా పని చేస్తూ భార్య పేరున కూడా మస్తరు నమోదు చేస్తున్నారు. మేడశెట్టి నవీన్ కాకినాడలో కోచింగ్ తీసుకుంటుండగా, నాగమణి విశాఖలో చదువుతుండగా బినామీ మస్తర్లు వేస్తున్నారు. శనివాడ శ్రీకాంత్ అనే యువకుడికి మే 2వ తేదీన వివాహం జరగ్గా అదే రోజు అతను ఉపాధి పనులకు హాజరైనట్లు మస్తరు వేశారు. కొల్లి మాధవితో పాటు అయితరెడ్డి రామకృష్ణ అతని భార్య వెంకటలక్ష్మి ముగ్గురు అచ్చుతాపురం బ్రాండిక్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా వీరు ప్రతి రోజూ ఉపాధి పనులకు వస్తున్నట్లు, సీరా అర్జున ప్రైవేటు కంపెనీలో చేయగా ఉపాధి పనికి వస్తున్నట్లు మస్తర్లు వేశారు. తాటికొండ గాటీలమ్మ, గొలుగొండ హేమంత్, గాడి చిన్నమ్మలు, మంగమ్మ, అయితరెడ్డి పైడితల్లమ్మ, దుర్గాభవాని, శ్రీనివాస్ తదితరులు ఏ రోజూ ఉపాధి పనులకు వెళ్లకపోయినా పనులకు వెళ్తున్నట్లు దొంగ మస్తర్లు వేస్తున్నారు. దొంగ మస్తర్లపై విచారణకు వచ్చిన కూలీలు రెండు వర్గాలుగా విడిపోయి తోపులాటలకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీడీవో ఫిర్యాదుతో బుచ్చెయ్యపేట ఎస్‌ఐ మనోజ్ కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ కొనసాగించారు. టీడీపీకి చెందిన డొంకిన రామారావు వీఆర్పీ భార్య సత్యవతిపై దాడి చేశాడు. దీంతో గ్రామస్తులు పలువురు వీఆర్పీ తప్పు చేయలేదని ఇటీవల కొత్తగా నియమించిన కొంతమంది మేట్లే తప్పుడుగా హాజరు నమోదు చేస్తున్నారని విచారణకు వచ్చిన అధికారులకు తెలిపారు. విచారణలో ఉండగా తనపై చేయి చేసుకున్న వ్యక్తిపై వీఆర్పీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


