భంగపాటు | - | Sakshi
Sakshi News home page

భంగపాటు

May 27 2026 5:50 AM | Updated on May 27 2026 5:50 AM

జిల్లాలో 13,661 మందికి రూ.27.32 కోట్లు మంజూరు

3 వేల మంది మత్స్యకారుల ఖాతాల్లో జమ కాని భృతి

గతేడాది లబ్ధిదారుల్లో 1,580 మందికి నిలిపివేత

అర్హులను కాదని అనర్హులకు నిషేధ భృతి

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మత్స్యకార నాయకులు

ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలతో మత్స్యకారుల ఓట్లను తమవైపు మలుచుకుని గద్దెనెక్కిన చంద్రబాబు..అధికారం చేపట్టిన మరుక్షణమే తొలి ఏడాది వేట నిషేధ భృతిని ఎగ్గొట్టారు. రెండో ఏడాదైనా పూర్తి స్థాయిలో ఇస్తారని ఎదురుచూసిన అర్హులైన లబ్ధిదారుల జాబితాలో కోత పెట్టడంతో నిరాశే ఎదురైంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 3 వేల మందికి భరోసా జమ కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన పెరిగింది.
గంగపుత్రులకు
కూటమి ప్రభుత్వం వచ్చాక..

నిరసన తెలియజేస్తున్న భరోసా పడని అర్హతున్న మత్స్యకారులు

సాక్షి, అనకాపల్లి: ఈ నెల 19న ప్రభుత్వం మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసింది. అయితే ఇంకా నేటికీ 3 వేల మంది మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందలేదు. భరోసా జమ కాని వారిలో ఎక్కువగా కొత్త లైసెన్స్‌ ఉన్న బోట్ల వారే ఉండడంతో, కావాలనే నిలిపివేశారేమోననే వాదన వినిపిస్తోంది. వేట మీదే ఆధారపడి జీవించే అర్హులైన మత్స్యకారులకు ఇంకా నగదు జమ కాకపోవడంతో జిల్లాలో పలుచోట్ల మత్స్యకారులు నిరసనలు చేపట్టారు.

కూటమికి అనుకూలంగా ఉన్నవారికే భృతి..

ప్రతి ఏడాది మే 15 నుంచి జూన్‌ 15 వరకు సముద్రంలో వేటను నిషేధిస్తారు. సముద్రంలో చేపల సంతానోత్పత్తికి ఎటువంటి విఘాతం కలిగించకూడదనేది దీని ప్రధాన ఉద్దేశం. ఈ వేట విరామ సమయంలో మత్స్యకారులు వలలను అల్లుకోవడంతో పాటు బోట్లకు మరమ్మతులు చేసుకుంటారు. చేపల వేటపైనే ఆధారపడి జీవించే గంగపుత్రులకు వేట నిషేధకాలంలో అందించే ఈ ఆర్థిక సహాయం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెట్టింపు (రూ.10 వేలు) చేసి అందించింది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆ పరిహారాన్ని మరింత పెంచుతామని హామీ ఇచ్చినా దాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది విస్మరించింది. రెండో ఏడాదిలో అరకొరగా అందించింది.

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు మేలు

అనకాపల్లి జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలో 31 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 14 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వారికి ఆర్థికంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ’ఆంధ్రా ఫిష్‌’ వంటి కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చింది. వేట నిషేధ సమయంలో మత్స్యకాారుల భృతి కోసం 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పెంచింది. 2014 టీడీపీ ప్రభుత్వంలో అరకొరగా ఉన్న మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచడంతో అప్పట్లో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.

2024లో మత్స్యకార భరోసాకు ఎగనామం పెట్టింది.

2025లో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో 11,544 మందికి రూ.23.28 కోట్ల భృతి అందించారు. కానీ సుమారు 1,500 మందికి వేట నిషేధ భృతి రాలేదు. విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా వచ్చాయని, ఫోర్‌ వీలర్స్‌ ఉన్నాయని, భూమి లేకపోయినా ఉన్నట్టు చూపడం వంటి సాంకేతిక సమస్యల సాకుతో సుమారు 500 మందికి భృతి నిలిపివేశారు.

2026లో జిల్లాలో మొత్తం 13,661 మంది మత్స్యకారులకు రూ.27.32 కోట్ల భృతి మంజూరైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పాయకరావుపేట నియోజకవర్గంలో 8,349 మందికి రూ.16.69 కోట్లు, యలమంచిలిలో 4,352 మందికి రూ.8.7 కోట్లు, పెందుర్తి పరిధిలో 960 మంది మత్స్యకారులకు రూ.1.92 కోట్లు మంజూరయ్యాయి.

కానీ జిల్లావ్యాప్తంగా దాదాపు 3వేల మంది అ ర్హులైన మత్స్యకారులకు భరోసా సొమ్ము జమకాలేదు.

పాయకరావుపేట నియోజకవర్గంలో 1850 మందికి భృతి జమ కాలేదు. పాయకరావుపేట మండలంలో వెంకటనగరం, రాజనగరం, పెంటకోట, రత్నంపేట, పాలంపేట, కొర్లంపేట, గజపతినగరం, రాజవరంలో 600 మందికి, ఎస్‌.రాయవరం మండలంలో రేవుపోలవరం, కొత్తరేవుపోలవరం, బంగారమ్మపాలెం గ్రామాల పరిధిలో 700 మందికి, నక్కపల్లి మండలంలో పెదతీనార్ల, చిన తీనార్ల, రాజయ్యపేట, దొండవాక గ్రామాల పరిధిలో 550 మందికిపైగా భరోసా అందలేదు.

యలమంచిలి నియోజకవర్గంలో అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి మండలాల్లో 1,000 మందికి పైగా మత్స్యకారులకు భరోసా దక్కలేదు. వీరిలో పూడిమడకలో 400 మంది, తంతడిలో 120 మంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement