గ్రావెల్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ దందా!

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

చోద్యం చూస్తున్న

మైనింగ్‌ అధికారులు

నిత్యం వందలాది

ట్రాక్టర్లపై తరలింపు

నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో గ్రావెల్‌ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. ప్రధానంగా ఏపీఐఐసీ భూములు, పునరావాస కాలనీ కోసం సేకరించిన భూములతో పాటు, జి.రాయితీ, డి.ఫారం భూముల్లో జోరుగా ఈ దందా జోరుగా సాగుతోంది. ట్రాక్టర్లతో అక్రమంగా ఇతర ప్రాంతాలకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించక పోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి వద్ద మంచి పలుకుబడి కలిగిన ఎస్‌.రాయవరం మండలం ఐటీడీపీ నాయకుడు కనుసన్నల్లో గ్రావెల్‌దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రతిరోజు వందలాది ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నా అడ్డుకునేందుకు మైనింగ్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. స్టీల్‌ప్లాంట్‌ బల్క్‌ డ్రగ్‌పార్క్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం పెదబోదిగల్లం వద్ద భూములు సేకరించింది. వీటి పక్కనే రైతులకు చెందిన డీఫారం, జిరాయితీ భూములున్నాయి. ఈ భూముల్లో ఉన్న గ్రావెల్‌ను కొంతమంది మాఫియా, కూటమినాయకులు, గ్రావెల్‌ వ్యాపారులు కలిసి పొక్లెయిన్లతో తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, కంపెనీలకు విక్రయిస్తున్నారు. నక్కపల్లి మండలం పెదబోదిగల్లం పునరావాస కాలనీ పక్కనే ఉన్న ఎస్‌.రాయవరం మండలానికి చెందిన పెదగుమ్ములూరు రెవెన్యూపరిధిలో ఉన్న భూముల నుంచి గ్రావెల్‌ను తవ్వి బోదిగల్లం,నక్కపల్లి మీదుగా జాతీయరహదారిపైకి తరలించి, అక్కడనుంచి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు, స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న రోడ్ల పనులకు తరలిస్తున్నారు.

అనుభవం లేని వారికి డ్రైవింగ్‌..

కాగా గ్రావెల్‌ ట్రాక్టర్లను అనుభవం లేని వ్యక్తులు నడుపుతున్నారు. బోదిగల్లం పునరావాస కాలనీనుంచి సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం మీదుగా నక్కపల్లి జాతీయరహదారిపైకి ఈ ట్రాక్టర్లు వస్తున్నాయి. డ్రైవింగ్‌ చేసే వారికి లైసెన్స్‌ ఉందా లేదా, ట్రాక్టర్లకు రికార్డులు ఉన్నాయా లేదా అనేది పోలీసులు తనిఖీలు చేయడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై అధిక లోడుతో వెళ్తున్న గ్రావెల్‌ ట్రాక్టర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించేవారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది డ్రైవర్లు మద్యం సేవించి ట్రాక్టర్లను నిర్లక్ష్యంగా నడుపుతున్నారని, వాహన చోదకులు చెబుతున్నారు.

ఒకే రశీదుపై...

గ్రామంలో పేదలు ఇల్లు నిర్మించుకునే సమయంలో పునాదుల్లో నింపుకొనేందుకు ట్రాక్టర్‌ మట్టి తీసుకువెళ్లే పట్టుకుని వందలాది రూపాయలు పెనాల్టీ విధిస్తున్న ఏఎంఆర్‌ సిబ్బంది, మైనింగ్‌ అధికారులు.. బోదిగల్లం, పెదగుమ్ములూరు పరిసర గ్రామాల నుంచి నిత్యం లక్షలాది క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌, మట్టి తరలిపోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రంగా రూ.450 ఏఎంఆర్‌ సిబ్బందికి చెల్లించి, ఒకే రశీదుపై 10 నుంచి 15 ట్రాక్టర్ల గ్రావెల్‌ తరలించుకుపోతున్నారు. ఎస్‌.రాయవరం మండలానికి చెందిన ఐటీడీపీకి నాయకుడు ఈ గ్రావెల్‌ అక్రమతవ్వకాల్లో కీలక పాత్రపోషిస్తున్నాడని సమాచారం.

అభివృద్ధి పేరుతో నమ్మించి..

ఎస్‌.రాయవరం మండలం పెద గుమ్ములూరు మీదుగా గ్రావెల్‌ను అక్రమంగా తరలించేవారి నుంచి ఆ గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు, కూటమిపెద్దలు గ్రామాభివృద్ధి, ఆలయాల నిర్మాణం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు నమ్మబలుకుతూ గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా చూస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అనుచరుడితో పాటు, పీఏ ఒకరు అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఐదు ట్రాక్టర్ల పట్టివేత

బోదిగల్లం సమీపంలో గ్రావెల్‌ అక్రంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఎస్‌.రాయవరం మండలానికి చెందిన రైతు, ఆప్కాఫ్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మాతా గురు నాథరావు శుక్రవారం పట్టుకున్నారు.తమ జిరాయితీ భూముల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారంటూ జాయింట్‌ కలెక్టర్‌కు, స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌.రాయవరం రెవెన్యూ సిబ్బంది ,నక్కపల్లి,ఎస్‌.రాయవరం పోలీసులు ఐదు ట్రాక్టర్లు, ఒక పొక్లెయిన్‌ యజమానులపై కేసులు నమోదు చేశారు.పట్టుకున్న ట్రాక్టర్లను ఎస్‌.రాయరం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement