పకడ్బందీగా టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

అనకాపల్లి టౌన్‌: జిల్లాలో ఈనెల 25 నుంచి జరగనున్న టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్‌ నుంచి విద్యాశాఖ, ఎంపీడీవో తదితర అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమలు చేయాలని, కేంద్రాల సమీపంలో గల జెరాక్స్‌ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పూర్తి సమయం పనిచేసేలా మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి ముగ్గురు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షల వేళల్లో తగినన్ని ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. తాగునీటి వసతి కల్పించాలని, శానిటేషన్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ప్రశ్నపత్రాల పంపిణీలో పోలీసు, పోస్టల్‌ శాఖలు అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఎక్కడైనా ప్రశ్నపత్రాలు లీకేజీ అయినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఐదు, పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా మానవతా దృక్పథంతో గ్రేస్‌ టైం ఇచ్చి పరీక్షకు అనుమతించాలన్నారు.

ఒకటో తరగతిలో ప్రవేశాలను పెంచాలి

ప్రభుత్వ పాఠశాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలను పెంచాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ గ్రామంలో ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీస్‌, ఉపాధ్యాయులతో కమిటీ వేసి ప్రవేశాలు, విద్యార్థుల హాజరు పెంచాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రవేశాలు పెంచకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ తెలిపారు.

కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఆదేశం

Advertisement
 
Advertisement
Advertisement